Supremecourt: కశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కుల అధికరణంపై సుప్రీంలో విచారణ వాయిదా
- ఆర్టికల్ 35 ఏ ద్వారా ప్రత్యేక హక్కులు
- సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేస్తూ పిటిషన్
- ఈనెల 27కి విచారణ వాయిదా
ఆర్టికల్ 35 ఏ.. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగం ఈ ఆర్టికల్ ద్వారా ప్రత్యేక హక్కులు, విశేషాధికారాలను ప్రసాదించింది. దీనిని సవాలు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ రోజు విచారణ జరగాల్సి వుంది. అయితే, విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఈ కేసును విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సంబంధించి ఒక న్యాయమూర్తి ఈ రోజు కోర్టుకు హాజరు కానందున విచారణను వాయిదా వేశారు. ఈ కేసును విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అన్న అంశాన్ని కూడా కోర్టు విచారిస్తుంది.
ఇదిలా ఉంచితే, ఈ కేసు విచారణను వ్యతిరేకిస్తూ కశ్మీర్లో వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరిగింది. వర్తక దుకాణాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రమంతటా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది.