durgada: దుర్గాడ పాము మరణానికి కారణం ఇదే: అటవీశాఖ నివేదిక
- పాము ముసలిదైపోయింది
- నీరసంతో మరణించింది
- వైద్యం అందించేందుకు స్థానికులు అంగికరించలేదు
సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా ప్రజల చేత మొక్కులు అందుకున్న దుర్గాడ పాము ముసలిదని ఉన్నతాధికారులకు అటవీశాఖ అధికారులు నివేదిక అందించారు. కుబుసం విడిచే క్రమంలో ఆ పాము అక్కడే ఉండిపోయిందని... దానికి తోడు నీరసంగా ఉండటంతో మరణించిందని చెప్పారు. దానిని అడవిలోకి తరలించేందుకు కానీ, వైద్యం అందించేందుకు కానీ ప్రజలు అంగీకరించలేదని తెలిపారు. ఆ పాము ఎవరినీ కరవలేదని చెప్పారు. పామును ఎవరూ గాయపరచని నేపథ్యంలో, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని తెలిపారు.
పామును తరలించాల్సిన అవసరం ఉందని స్థానిక ఎమ్మెల్యేకు చెప్పామని... అయితే దాన్ని సుబ్రహ్మణ్యుడి అవతారంగా ప్రజలు భావిస్తున్నారని, వారి మనోభావాల దృష్ట్యా జోక్యం చేసుకోవద్దని చెప్పారని వివేదికలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మరణించిన పామును తమకు అప్పగించాలని కోరినా, స్థానికులు అంగీకరించలేదని... చివరకు అటవీశాఖ అధికారుల సమక్షంలో అదే స్థలంలో పామును ఖననం చేశారని నివేదికలో తెలిపారు.