Chrostopher: 'క్రిస్టొఫర్ రాబిన్' కొంప ముంచిన టెడ్డీ బేర్.. చైనాలో అంతే!
- ‘క్రిస్టొఫర్ రాబిన్’ విడుదలకు చైనా నిరాకరణ
- 'విన్నీ ద పూ' సీరీస్ నుండి వస్తున్న చిత్రం కావటమే కారణం
- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను టెడ్డీ బేర్ తో పోల్చటమే కారణం
హాలీవుడ్ ఫాంటసీ కామెడీ డ్రామాగా బాగా పాప్యులర్ అయిన ‘విన్నీ ద పూ’ సిరీస్ నుండి వచ్చిన చిత్రం 'క్రిస్టొఫర్ రాబిన్'. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం చైనాలో మాత్రం విడుదల కాలేదు. చైనా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిరాకరించింది. అయితే, దీని విడుదలకు చైనా నిరాకరించటానికి కారణం 'టెడ్డీ బేర్'! ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు ఈ టెడ్డీ బేర్ విషయంలో చైనా ఎందుకు సీరియస్ గా వుంది? అంటే దానికి పెద్ద కారణమే ఉంది మరి.
డిస్నీ సంస్థకు చెందిన పాప్యులర్ సీరీస్ 'విన్నీ ద పూ' లోని టెడ్డీ బేర్ ఫొటోలతో చైనా అధక్షుడు జిన్ పింగ్ ని పోలుస్తూ జరిగిన పబ్లిసిటీనే దీనికి ప్రధాన కారణం! 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..జిన్‌పింగ్‌ని కలిసినప్పుడు వారిని 'విన్నీ ద పూ' సీరీస్ లోని టెడ్డీ బేర్ లతో పోలుస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేశారు. చైనాకు చెందిన పలు వెబ్‌సైట్లు టెడ్డీ బేర్ బొమ్మను దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పోలుస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో చైనా ప్రభుత్వం ‘విన్నీ ద పూ’ సిరీస్‌ను అన్ని వెబ్‌సైట్ల నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాదు, అప్పటి నుండి ఏ సినిమాలో అయినా టెడ్డీ బేర్ పాత్ర వుంటే సెన్సార్ కత్తెర వేయమని ఆదేశించింది. జిన్ పింగ్ ను టెడ్డీ బేర్ తో పోలుస్తూ 'లాస్ట్ వీక్ టు నైట్' అనే షోకు యాంకర్ గా వ్యవహరించిన జాన్ ఓలీవర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఏకంగా ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు హెచ్‌బీవో ఛానల్ నే నిషేధించింది చైనా ప్రభుత్వం.
ఇక లైవ్ యాక్షన్ చిత్రమైన ‘క్రిస్టొఫర్ రాబిన్’ సినిమాలో కూడా ప్రధాన పాత్ర టెడ్డీ బేర్ ది కావటమే కారణం అని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై చైనా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఈ సినిమా విడుదల వ్యవహారంలో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చైనాలో ప్రతి ఏటా విదేశీ సినిమాలు విడుదల చేయడానికి ఒక కోటా ఉంటుందని , ఏడాదికి కేవలం 34 సినిమాలు మాత్రమే ప్రదర్శించాలనే నియమం వున్న కారణంగా ‘క్రిస్టొఫర్ రాబిన్’ ను, అంత కంటే ముందు ‘ఎ రింకిల్ ఇన్ టైమ్’ అనే మరో విదేశీ చిత్రాన్ని కూడా నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
ఏది ఏమైనా, జిన్ పింగ్ ను టెడ్డీ బేర్ తో పోల్చటమే చైనాలో డిస్నీ ‘విన్నీ ద పూ’ సిరీస్ నుండి వచ్చిన 'క్రిస్టొఫర్ రాబిన్’ కొంప ముంచిందని పరిశీలకుల అభిప్రాయం.