Rahul Gandhi: బీజేపీ హయాంలో మహిళలకు రక్షణ లేదన్న రాహుల్ గాంధీ!
- మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకపోవటంపై బీజేపీపై రాహుల్ ఆగ్రహం
- బీజేపీ, ఆరెస్సెస్ భావజాలమే అంతన్న కాంగ్రెస్ చీఫ్
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటన
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే పూర్తిమద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మహిళాబిల్లు ప్రవేశపెట్టకపోవటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని మహిళా కాంగ్రెస్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీతో పాటు ఆరెస్సెస్ పైన కూడా నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ బీజేపీ హయాంలో మహిళలకు రక్షణ లేదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తామే మహిళా బిల్లును సభలో ఆమోదింపజేస్తామని స్పష్టంచేశారు.
కేవలం పురుషులే ఈ దేశాన్ని ఏలాలనేది బీజేపీ, ఆరెస్సెస్ ల భావజాలమని, అందుకే ఆరెస్సెస్ తన కార్యక్రమాలలో మహిళల ప్రవేశాన్ని అంగీకరించదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా కావాలనే మహిళా బిల్లును పెండింగ్ లో పెట్టారని చెప్పిన రాహుల్ గాంధీ, బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
యూపీలో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు వున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రధాని చోద్యం చూస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకరంగా మహిళలపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వం 'బేటి బచావో' అన్నా బాలికలకు రక్షణ లేదని చెప్పిన రాహుల్ గాంధీ.. జిల్లాకు 40 లక్షల నిధులే కేటాయించిన కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో స్పష్టమైన వైఖరిని చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.