karunanidhi: కరుణానిధి తుదిశ్వాస విడవడం విషాదంలో ముంచింది: పవన్ కల్యాణ్
- ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడు ‘కలైంగర్’ కరుణానిధి
- అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించా
- కరుణ మృతి యావత్ దేశానికి తీరని లోటు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తుదిశ్వాస విడవడం విషాదంలో ముంచిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడైన ‘కలైంగర్’ కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించానని, వారి అస్తమయం కేవలం తమిళనాడుకూ కాదు యావత్ దేశానికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తీరనిలోటని అన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
తమిళనాడు రాజకీయాలే కాదు భారత రాజకీయ చిత్రంపై కరుణానిధి ముద్ర బలంగా ఉందని అన్నారు. రచనా వ్యాసంగం నుంచి రాజకీయ యవనిక పైకి వచ్చిన కలైంగర్ గానే తమిళుల హృదయాల్లో ఆయన నిలిచారంటే తమిళ సాహిత్యంపై వారి ప్రభావం ఎంత ఉన్నతమైనదో తెలుస్తుందని అన్నారు. రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా కరుణానిధి వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికి, భావి తరాలకు చిరస్మరణీయాలని పవన్ పేర్కొన్నారు.