Karunanidhi: దక్షిణామూర్తి... కరుణానిధిగా మారాడిలా!
- ద్రవిడ ఉద్యమ స్ఫూర్తిని నరనరానా ఎక్కించుకున్న దక్షిణామూర్తి
- దేవుడి పేర్లను త్యజించాలన్న కోరికతో పేరు మార్పు
- కలైకుడి ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత పాప్యులారిటీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆ పేరును ఎందుకు మార్చుకున్నారన్న విషయం వెనుక ఓ ఆసక్తికర విషయం దాగుంది. ముత్తువేల్, అంజు అనే తెలుగు మూలాలున్న దంపతులకు 1924లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని నాగపట్టణం జిల్లా తిరుక్కువలై అనే గ్రామంలో కరుణ జన్మించాడు. ఆపై తన 29 ఏట... అంటే, 1953, జూలై 15న... తమిళనాడులోని కళ్లకుడి పేరును దాల్మియాపురంగా మార్చాలని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, డీఎంకే సభ్యులు పెను ఉద్యమాన్ని ప్రారంభించారు.
హిందీకి వ్యతిరేకంగా నినదిస్తూ, రైల్వే స్టేషన్లలో హిందీ బోర్డులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో దక్షిణామూర్తి సైతం నల్లజెండా చేత పట్టుకుని నిరసనలు తెలిపాడు. ఎదురుగా రైలు వస్తుంటే, ధైర్యంగా పట్టాల మీద పడుకున్నాడు. పోలీసులను తెల్లబోయేలా చేసిన దక్షిణామూర్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, రూ. 35 జరిమానా, 5 నెలల జైలు శిక్ష పడింది. జరిమానా కట్టడానికి నిరాకరించిన దక్షిణామూర్తి, ఏడాదికిపైనే జైల్లో గడిపాడు. చివరకు అనుకున్నది సాధించాడు. పేరు మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. దేవుడి పేర్లను త్యజించాలన్న ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో తన పేరును మార్చుకోవాలని ఆయన భావించాడు. అతని పోరాటాన్ని, నాయకత్వ లక్షణాలను చూసిన పలువురు ఆయన్ను కళ్లకుడి కొండ కరుణానిధి (కళ్లకుడిని గెలిచిన కరుణానిధి) అని పిలుస్తుండటంతో, అదే పేరుతో పాప్యులర్ అయ్యారు,