karunanidhi: ఉచిత పథకాలకు ఆద్యుడు.. దేశంలోనే తొలిసారి రైతులకు ఉచిత విద్యుత్తు అందించిన కరుణ!
- ఉచిత పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించిన కరుణ
- పలు సంక్షేమ పథకాల ప్రకటన
- హామీలు చూసి నోరెళ్లబెట్టిన నాయకులు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజకీయాల్లో తమిళనాడు కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మొదటి నుంచీ ప్రాంతీయ పార్టీలదే హవా. వాటి మధ్యే పోటీ. జాతీయ పార్టీలను తమిళులు అంగీకరించరు. ఈ కారణంగా అక్కడ కాంగ్రెస్, బీజేపీ వంటివి తమ ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. పోటీ ఎప్పుడూ డీఎంకే-అన్నాడీఎంకే మధ్యనే. దీంతో ఎన్నికలు వస్తే చాలు హామీల వర్షం కురిసేది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రకటించే ఎన్నికల హామీలు చూసి దేశం మొత్తం నోరెళ్లబెట్టేది.
ఇక, ఉచిత పథకాల చరిత్రలో కరుణానిధి కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. దేశం దృష్టిని తమిళనాడు వైపు మళ్లించారు. 2006లో కరుణానిధి ఉచిత కలర్ టీవీల హామీని చూసి రాజకీయనాయకులు నోరెళ్లబెట్టారట. 1967లో కరుణానిధి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బిచ్చగాళ్లు, రిక్షా కార్మికుల కోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. మనుషులను ఎక్కించుకుని రిక్షాలు లాగడం అనాగరికమని పేర్కొంటూ, చేతి రిక్షాలను నిషేధించి సైకిల్ రిక్షాలను అందించారు. 1989లో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తుతో దేశం దృష్టిని మరోమారు తమవైపు తిప్పుకున్నారు. 1996లో నాలుగోసారి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.