Krishna District: స్వయంగా బుజ్జగించిన చంద్రబాబు... రాజీనామాను వెనక్కు తీసుకున్న బూరగడ్డ
- రెండు రోజుల క్రితం బూరగడ్డ రమేష్ నాయుడు రాజీనామా
- బూరగడ్డను సీఎం వద్దకు తీసుకెళ్లిన దేవినేని ఉమ
- ఏకాంతంగా చంద్రబాబు మాట్లాడిన తరువాత మెత్తబడ్డ బూరగడ్డ
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా నేత బూరగడ్డ రమేష్ నాయుడు వెనక్కు తగ్గారు. సీఎం చంద్రబాబు స్వయంగా బుజ్జగించడం, పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో తన రాజీనామా లేఖను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ముడా చైర్మన్ గా బూరగడ్డ వేదవ్యాస్ ను నియమించిన తరువాత, మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాపు వర్గపు నేతల్లో ముందుండే రమేష్ నాయుడు, సర్పంచ్ గా, ఎంపీపీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా సేవలందించారు. బూరగడ్డ రాజీనామా తరువాత, దేవినేని ఉమ, బచ్చల అర్జునుడు ఆయన్ను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై ఆయన్ను తీసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు. చంద్రబాబు సైతం రమేష్ నాయుడితో ఏకాంతంగా సమావేశమై మాట్లాడారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే వేదవ్యాస్ కు పదవి ఇవ్వాల్సి వచ్చిందని, సీనియర్లు అర్థం చేసుకోకుంటే ఎలాగని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో రమేష్ నాయుడు వెనక్కుతగ్గారు.