gvl: ఒక తెలుగువాడిగా రైల్వేజోన్ కోసం కేంద్రమంత్రిపై ఒత్తిడి తెస్తున్నా: జీవీఎల్
- నాపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం
- నిన్నటి సమావేశానికి గంట ముందుగానే వెళ్లాను
- రైల్వేజోన్ ను త్వరగా ప్రకటించాలని మంత్రిని కోరా
ఢిల్లీలోని రైల్ భవన్లో రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. కేంద్ర మంత్రి స్పందించాల్సిన విషయాలపైనా జీవీఎల్ స్పందించడంపై టీడీపీ ఎంపీలు మండిపడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీవీఎల్ స్పందిస్తూ, తనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. నిన్నటి సమావేశం జరగడానికి గంట ముందుగా తాను అక్కడికి వెళ్లానని, విశాఖ రైల్వేజోన్ ను అన్ని పార్టీలు అడుగుతున్నాయని, ఇది పార్టీలకు అతీతమైన విషయమని చెప్పానని, ఈ అంశాన్ని త్వరగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కోరానని అన్నారు.
"నేనంటే టీడీపీకి ఎందుకంత అసహనం? రైల్వేజోన్ కోసం కేంద్ర మంత్రిని అడిగా. కేంద్ర మంత్రి దగ్గర సమావేశానికి నేను, హరిబాబు వస్తున్నట్లు గంట ముందుగానే సీఎం రమేష్, సుజనా చౌదరికి తెలుసు. క్రెడిట్ అంతా తమకే రావాలని టీడీపీ భావించింది. ఒక తెలుగువాడిగా రైల్వేజోన్ కోసం కేంద్రమంత్రిపై ఒత్తిడి తేవడానికి నేను మాట్లాడాను" అని జీవీఎల్ చెప్పారు.