Rape: మూడు రోజుల్లోనే రేప్ కేసులో తీర్పు.. 24 ఏళ్ల యువకుడికి జీవిత ఖైదు!
- ఆరేళ్ల బాలికపై అత్యాచారం
- నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన పోలీసులు
- మూడు రోజుల్లోనే విచారణ పూర్తి
- దేశంలో అత్యంత వేగంగా తీర్పు
అత్యాచారం కేసుల్లో ఇదే అత్యంత వేగవంతమైన తీర్పు. కేసును విచారించిన కోర్టు కేవలం మూడు రోజుల్లోనే శిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు జీవితకాల శిక్ష విధించింది. మరణించే వరకు అతడిని జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని దాతియా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
దాతియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ అవస్థి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన మోతిల్ అతిర్వార్ (24) ఈ ఏడాది మే 29న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ లోని దాతియా పట్టణానికి ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన బాలికకు పువ్వులు ఇస్తానని చెప్పి నమ్మించిన అతిర్వార్ సమీపంలోని ప్రభుత్వ స్కూలులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి దోషికి శిక్ష విధించింది.