Nitish Kumar: ఆఖరి క్షణంలో అనూహ్య నిర్ణయం... ఎన్డీయేకి అండగా నిలిచిన టీఆర్ఎస్
- ఆఖరి నిమిషంలో నితీశ్ నుంచి కేసీఆర్ కు ఫోన్
- మనసు మార్చుకున్న టీఆర్ఎస్ అధినేత
- హరివంశ్ కు మద్దతుగా నిలిచిన ఆరుగురు ఎంపీలు
నేడు జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా లేని టీఆర్ఎస్ ఆఖరి క్షణంలో బీజేపీ మద్దతుతో నిలబడిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలికింది. ఆయనకు అనుకూలంగా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో ఉన్న ఆరుగురు ఎంపీలూ ఓటు వేశారు.
డివిజన్ అనంతరం హరివంశ్ కు 125 ఓట్లు లభించిన సంగతి తెలిసిందే. ఇందులో బీజేపీ నుంచి 73, ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన 20 మంది, అన్నాడీఎంకే నుంచి 13, బీజేడీ నుంచి 9, టీఆర్ఎస్ నుంచి 6, నామినేటెడ్ సభ్యులు నలుగురు ఉన్నారు.
కాగా, ఈ ఉదయం ఈ ఓటింగ్ లో పాల్గొనరాదని కేసీఆర్ తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆపై నితీశ్ కుమార్ నుంచి వచ్చిన ఫోన్ తో ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బరిలో ఉన్నది బీజేపీ అభ్యర్థి కాదని, తమ పార్టీ అభ్యర్థని ఆయన నచ్చజెప్పడంతోనే కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీలు హరివంశ్ కు ఓటేసినట్టు సమాచారం.