rajyasabha deputy chairman: జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎదిగిన హరివంశ్ నారాయణ్ సింగ్!
- హరివంశ్ స్వస్థలం యూపీ లోని భలియా
- బీహెచ్ యూ నుంచి ఎకనామిక్స్ లో పీజీ
- 1977లో టీఓఐలో ట్రైనీ జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభం
- పలు వార్తా సంస్థల్లో ఎడిటర్ గా పని చేసిన హరివంశ్
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని భలియా. హరివంశ్ 1956 జూన్ 30న జన్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన ఎదిగిన క్రమం ఆసక్తిదాయకం.
బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్ యూ) నుంచి ఎకనామిక్స్ లో పీజీ పట్టా సాధించారు. జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం ఆయనపై ఉండేది. దీంతో, 1974లో జేపీ చేపట్టిన ఉద్యమంలో హరివంశ్ చురుగ్గా పాల్గొన్నారు. తన కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.500 వేతనానికి పనిచేశారు. ఆయన జర్నలిస్టుగా కూడా పని చేశారు. 1977లో టైమ్స్ ఆఫ్ ఇండియా (టీఓఐ)లో ట్రైనీ జర్నలిస్ట్ గా చేరిన ఆయన, ఆ తర్వాత ముంబయికి వెళ్లారు. ‘ధర్మయుగ్’ మ్యాగ్ జైన్ లో 1981 వరకూ పని చేశారు.
ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1981 నుంచి 1984 వరకు పని చేశారు. బ్యాంకు ఉద్యోగం అనంతరం మళ్లీ పత్రికారంగం వైపే ఆయన వచ్చారు. 'అమృత్ బజార్' పత్రికకు చెందిన మ్యాగజైన్ ‘రవివార్’కు ఆయన అసిస్టెంట్ ఎడిటర్ గా వ్యవహరించారు. పలు వార్తా సంస్థల్లో ఎడిటర్ గా చేశారు. ముఖ్యంగా ‘ప్రభాత్ కబర్’కు ఇరవై ఐదేళ్ల పాటు ఆయన ఎడిటర్ గా ఉండటం గమనార్హం.
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు మీడియా సలహాదారుగా కూడా హరివంశ్ వ్యవహరించారు. జర్నలిస్టుగా ఆయన సేవలను గుర్తించిన నితీశ్ కుమార్ 2014లో తమ జేడీయూ తరపున హరివంశ్ ను రాజ్యసభకు పంపించారు.