vibhav raut: సనాతన్ సంస్థాన్ సభ్యుడి ఇంటిపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడి.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
- పెట్రోల్ బాంబులు, డిటోనేటర్లు లభ్యం
- అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు
- ఈ రోజు కోర్టులో హాజరుపర్చే అవకాశం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా హిందూ గోవంశ్ రక్షా సమితి, సనాతన్ సంస్థాన్ లో సభ్యుడిగా ఉన్న వైభవ్ రౌత్ ను అరెస్ట్ చేసింది. నల్లసోపరా ప్రాంతంలో ఉన్న రౌత్ ఇంటితో పాటు షాపుపై దాడులు నిర్వహించిన మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు.. పెట్రోల్ బాంబులు, డిటోనేటర్లతో పాటు భారీ ఎత్తున గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై ఏటీఎస్ వర్గాలు ఇంకా స్పందించలేదు.
గత కొంతకాలంగా రౌత్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. గురువారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అరెస్ట్ చేసిన అనంతరం ముంబైలోని ఏటీస్ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు రౌత్ ను కోర్టు ముందు ఏటీఎస్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
కాగా, రౌత్ ను అరెస్ట్ చేయడాన్ని హిందూ జాగృతి సమితి (హెచ్ జేఎస్) మాలేగావ్-2 గా అభివర్ణించింది. మహారాష్ట్రలోని ముస్లిం మెజారిటీ ప్రాంతమైన మాలేగావ్ లో 2008, సెప్టెంబర్ 29న బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కల్నల్ పురోహిత్ ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యారు. కాగా, హిందూ సంస్థలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని హెచ్ జేఎస్ ఆరోపించింది.