YSRCP: జగన్ సతీమణి భారతిపై చార్జిషీట్ వేసింది మీడియా కాదు.. ఈడీ: ప్రభుత్వ విప్ కూన
- భారతిని ఐదో ముద్దాయిగా చేర్చింది
- ముందు దానికి సమాధానం చెప్పండి
- ఎల్లో మీడియా అంటూ ఏడవడం మానండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై ఈడీ అభియోగాలు నమోదు చేసిందన్న వార్తలు నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన జగన్ అదంతా ఎల్లో మీడియాకు ముందే ఎలా తెలిసిందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బహిరంగలేఖ విడుదల చేశారు. ఆ వార్తలు చూసి షాకయ్యానని పేర్కొన్నారు. జడ్జి పరిగణనలోకి తీసుకోకముందే పత్రికలకు ఎలా తెలిసిందని మండిపడ్డారు.
జగన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ స్పందించారు. భారతిపై చార్జిషీట్ దాఖలు చేసింది మీడియా కాదని, ఈడీ అని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతిపై ఈడీ వేసిన చార్జిషీట్‌పై వైసీపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా ఎల్లో మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. భారతిని ఐదో ముద్దాయిగా ఈడీ పేర్కొందని స్పష్టం చేశారు. భారతి పేరును ఈడీ చేరిస్తే మీడియాపై దుమ్మెత్తి పోయడమేంటని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.