dalai lama: దిగొచ్చిన దలైలామా.. నెహ్రూపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ
- నెహ్రూ ప్రధాని కావడం వల్లే భారత్-పాక్ విడిపోయాయన్న దలైలామా
- జిన్నాను ప్రధానిని చేయాలని గాంధీ భావించారన్న ఆధ్యాత్మిక గురువు
- వివాదాస్పదం కావడంతో క్షమాపణలు
భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణంగానే భారత్-పాక్‌లు విడిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా వెనక్కి తగ్గారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. ‘నా వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి’ అని పేర్కొన్నారు.
దలైలామా ఇటీవల గోవా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. మహమ్మద్ జిన్నాను మహాత్మాగాంధీ ప్రధానిని చేయాలని అనుకున్నారని అన్నారు. అదే జరిగి ఉంటే భారత్-పాక్‌లు రెండుగా విడిపోయి ఉండేవి కావన్నారు. జిన్నాను ప్రధాని చేసేందుకు నెహ్రూ అంగీకరించలేదని పేర్కొన్నారు. నెహ్రూ ప్రధాని కావడం వల్లే భారత్-పాక్‌లు విడిపోయాయన్నారు. ఎంతో అనుభవం ఉన్న, తెలివైన వ్యక్తే తప్పులు చేశారని, కాబట్టి సందర్భానుసారంగా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దలైలామా వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. భారత్-పాక్ విడిపోవడానికి నెహ్రూ కారణమా? అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోశారు. దీంతో దిగివచ్చిన దలైలామా తాజాగా క్షమాపణలు చెప్పారు.