amit shah: మమతా బెనర్జీని కూకటివేళ్లతో పెకిలిస్తాం: అమిత్ షా
- ఎవరు అడ్డుపడినా అసోంలో ఎన్ఆర్సీ ప్రక్రియ ఆగదు
- బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులే మమత ఓటు బ్యాంక్
- అక్రమంగా దేశంలో ఉంటున్న వారిని తరిమివేయొద్దా?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కూకటివేళ్లతో పెకిలిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కోల్ కతాలో జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ను మమత వ్యతిరేకిస్తున్న అంశంపై మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నవారే మమత ఓట్ బ్యాంక్ అని విమర్శించారు. ఎన్నార్సీని అడ్డుకోవడానికి మమత యత్నిస్తున్నారని... కానీ, దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమివేసే ఒక ప్రక్రియే ఎన్నార్సీ అని చెప్పారు. బంగ్లాదేశ్ వలసదారులను తరిమేయవద్దా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ వరకైతే దేశమే ముఖ్యమని, ఆ తర్వాతే ఓట్ బ్యాంక్ అని అమిత్ అన్నారు. ఎన్నార్సీని అడ్డుకోవడానికి మీరు ఎంత యత్నించినా... తాము మాత్రం దాన్ని ఆపబోమని చెప్పారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోల్ కతా పర్యటనను అమిత్ షా చేపట్టారు. ఈ రాష్ట్రం నుంచి 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014లో ఇక్కడి నుంచి కేవలం ఇద్దరు బీజేపీ ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. దీంతో, రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకునేందుకు అమిత్ షా ఎత్తులు వేస్తున్నారు. 21 సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఇప్పటికే టార్గెట్ విధించారు.