JNU: జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్ పై దాడి .. పరారైన నిందితుడు!
- ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో కాల్పులు
- తృటిలో తప్పించుకున్న ఉమర్
- ఘటనాస్థలం నుంచి పరారైన దుండగుడు
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్ పై ఈ రోజు హత్యాయత్నం జరిగింది. తుపాకీతో ఉమర్ పై కాల్పులు జరపడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, దాడి నుంచి ఉమర్ సురక్షితంగా బయటపడ్డాడు.
‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ సంస్థ ఢిల్లీలో సోమవారం ‘భయం నుంచి విముక్తి’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి హాజరైన అనంతరం ఓ టీ స్టాల్ వద్ద మిత్రులతో కలసి టీ తాగుతుండగా.. ఉమర్ పై ఓ దుండగుడు దాడి చేసి, తోయడంతో అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత కాల్చడానికి ప్రయత్నించడంతో అక్కడనున్న వాళ్లు అడ్డుకున్నారు. దాంతో దుండగుడు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
2016, ఫిబ్రవరిలో జేఎన్ యూలో జరిగిన ఓ ర్యాలీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన వీడియోలను ఎడిట్ చేశారని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. రిపబ్లిక్ టీవీ, ఇతర విద్వేష మీడియా కారణంగానే ఉమర్ పై దాడి జరిగిందని జేఎన్ యూ విద్యార్థుల సంఘం మాజీ వైస్ ప్రెసిడెంట్ షీలా రషీద్ ఆరోపించారు.