modi: మోదీ లాగే తెలంగాణ సీఎం కూడా వ్యవహరిస్తున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు
- నాడు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు
- నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
- తెలంగాణలో ఒకే కుటుంబం లబ్ధి పొందుతోంది
ప్రధాని మోదీ లాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా శేరిలింగంపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో ఒకే కుటుంబం లబ్ధి పొందుతోందని విమర్శించారు.
నాడు ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఈ నాలుగేళ్లలో పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, 22 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి, 5 వేల ఇళ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు రెవెన్యూతో సంపన్నంగా ఉందని, ఇప్పుడు అప్పుల్లో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన నిప్పులు చెరిగారు. రాఫెల్ కుంభకోణం, అవినీతి గురించి పార్లమెంటులో తాను ప్రశ్నించిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. వీటి గురించి మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, పార్లమెంటులో మోదీ ఎక్కడెక్కడో చూస్తూ మాట్లాడారని, తన కళ్లలోకి చూస్తూ మాట్లాడే ధైర్యం ఆయనకు లేకపోయిందని విమర్శించారు. అవినీతిపరులే ఎదుటి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడలేరని, మోదీ కాపలాదారు కాదని, అవినీతిలో భాగస్వామి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.