Telangana: కేంద్రంలో అధికారం మాదే.. ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్నీ నెరవేరుస్తాం: రాహుల్
- విభజన హామీలు తెలుగు రాష్ట్రాల హక్కు
- మోదీ చౌకీదారు కాదు.. కుంభకోణాల భాగస్వామి
- దేశంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన తొలి రోజు శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. విభజన సందర్భంగా ఏపీ, తెలంగాణలకు హామీ ఇచ్చామని, అవి వాటి హక్కు అని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తొలుత అమలు చేసేది వాటినేనన్నారు.
ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్ సన్నిహితంగానే ఉంటారని, అయినప్పటికీ హామీలను ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణలో కానీ, అటు ఢిల్లీలో కానీ విలేకరులు స్వేచ్ఛగా, ఉన్నది ఉన్నట్టు వార్తలు రాసే వాతావరణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇది సాగదని, బెదిరింపు సర్కారులు కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
పార్లమెంటులో తాను మోదీ కళ్లలోకి చూసి రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం గురించి మాట్లాడినప్పుడు మోదీ దిక్కులు చూస్తూ కూర్చున్నారని అన్నారు. దొంగకు మన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ఉండదని రాహుల్ అన్నారు. మోదీ తను చెప్పుకుంటున్నట్టు చౌకీదారు (కాపలాదారు) కాదని, రెండున్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి భాగస్వామి అని ఆరోపించారు.