YSRCP: జగన్ సానుభూతి కోసమే అలా చెబుతున్నారు.. 2016లో భారతి ఆస్తుల జప్తు: ధూళిపాళ్ల
- క్విడ్ ప్రో కో విధానంలోనే జగన్‌కు బెంగళూరులో వాణిజ్య భవనం
- క్లాసిక్ కంపెనీకి భారతి డైరెక్టర్
- తన కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులపై తప్పుడు కథనాలు
- ఇదీ జగన్ చరిత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆస్తులను రెండేళ్ల క్రితమే ఈడీ జప్తు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. ఆస్తుల జప్తుపై ఆమె హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆ కేసేదో ఇప్పుడే నమోదైనట్టు జగన్ చెబుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై పలు ఆరోపణలు చేశారు.
క్విడ్ ప్రో కో విధానంలో 'మంత్రి డెవలపర్స్' అనే కంపెనీకి హైదరాబాద్‌లో ఐటీ సెజ్ భూమి కేటాయించి, అందుకు ప్రతిగా బెంగళూరులో వాణిజ్య భూమిని జగన్ తీసుకున్నది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. క్లాసిక్ రియాలిటీ పేరిట తీసుకున్న ఈ భవంతి ద్వారా నాలుగేళ్లలో రూ.193 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. క్లాసిక్ కంపెనీకి జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
భారతి సిమెంట్స్‌లో జగన్ పెట్టుబడి రూ.8-10 లక్షలు మాత్రమేనని, కానీ జగన్‌కు వచ్చిన డివిడెండ్ మాత్రం రూ.81 కోట్లని నరేంద్ర తెలిపారు. ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులపై తప్పుడు కథనాలు రాసి, ఫిర్యాదులు చేస్తూ వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. చివరికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కూడా ఈ బాధ తప్పలేదన్నారు. తన పత్రికలో ఇతరుల కుటుంబ సభ్యులపై కథనాలు రాయించిన ఘనత జగన్‌దేనన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు కావడం చాలా సహజమని నరేంద్ర పేర్కొన్నారు.