Donald Trump: మోదీ కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతానన్న ట్రంప్!
- ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన అమెరికా మీడియా సంస్థ పొలిటికో
- నేపాల్, భూటాన్ లను భారత్ అంతర్భాగంగా భావించిన ట్రంప్
- ట్రంప్ మరిచిపోయిన మర్యాదలు, టెంపరితనంపై పొలిటికో కథనం
మోదీ కోసం అవసరమైతే పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గత ఏడాది భారత్, అమెరికా అధినేతల సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట. అప్పుడు జరిగిన ఈ సరదా వ్యాఖ్యలను అమెరికా మీడియా సంస్థ 'పొలిటికో' ఇప్పుడు బయటపెట్టింది. మోదీ ఒప్పుకుంటే ఆయన కోసం తాను వధువును చూస్తాను అని ట్రంప్ చతుర్లాడారంటూ పొలిటికో పేర్కొంది.
విదేశీ నేతలతో సమావేశాల సందర్భంగా ట్రంప్ మర్చిపోయిన మర్యాదల గురించి 'దౌత్య సమావేశాలు-తప్పిదాలు' అనే కథనాన్ని పొలిటికో ప్రచురించింది. విదేశీ నేతలతో సమావేశం సందర్భంగా ట్రంప్ టెంపరితనం, టెలిఫోన్ కాల్స్ సందర్భంగా మరిచిపోయిన మర్యాదలు, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్చరించిన సందర్భాల గురించి ఈ కథనంలో పేర్కొంది. గత ఏడాది భారత్ తో జరిగిన సమావేశం సందర్భంగా దక్షిణాసియా మ్యాప్ ను ట్రంప్ తొలిసారి పరిశీలించారట. ఈ సందర్భంగా నేపాల్ ను నిపుల్, భూటాన్ ను బుట్టోన్ గా పలికారని పొటిలికో తెలిపింది. అంతేకాదు ఈ దేశాలను కూడా భారత్ లో అంతర్భాగంగానే ట్రంప్ భావించారట.
ఇదే సమయంలో మోదీ గురించి ప్రస్తావన రావడంతో... ప్రస్తుతం మోదీ భార్యతో కలసి ఉండటం లేదని, అందువల్ల సమావేశానికి ఆయన ఒంటరిగానే వస్తున్నారని వైట్ హౌస్ అధికారులు ట్రంప్ కు తెలిపారట. ఈ సందర్భంగా, మోదీకి తాను వధువును వెతుకుతానంటూ చలోక్తి విసిరారట. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు ఆ విషయాలను తమకు వివరించారని పొలిటికా ప్రచురించింది.