Kerala: కేరళలో ఏనుగు ప్రాణాలు కాపాడేందుకు... ప్రాజెక్టు గేట్ల మూసివేత!
- కేరళలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- అతిరాపల్లి వద్ద వరదలో చిక్కుకున్న ఏనుగు
- మూడు గంటల పాటు ప్రాజెక్టు గేట్ల మూసివేత
కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని నదులూ ఉప్పొంగి ప్రవహిస్తుండగా, వరదల్లో చిక్కుకున్న ఓ ఏనుగును కాపాడేందుకు పెరిగల్ కోత్ డ్యామ్ గేట్లను మూసివేయించారు అధికారులు. త్రిసూర్ జిల్లాలోని అతిరాపల్లి వాటర్ ఫాల్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఏనుగు నీరు తాగుతున్న సమయంలో భారీ వరద రావడంతో, తనకు కనిపించిన ఓ రాతి గుట్టను ఎక్కిన ఏనుగు, ఎటూ వెళ్లలేక ఒక రోజంతా అక్కడే నిలబడింది.
దీన్ని గమనించిన ప్రజలు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చినా, ఏనుగును ఎలా కాపాడాలో తెలియక, జలపాతంలోకి నీటిని విడుదల చేసే పెరింగల్ కోత్ డ్యామ్ నిర్వహణా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు మూడు గంటల పాటు గేట్లను మూసివేయగా, వరద నీరు తగ్గింది. అప్పటికీ ఏనుగు కదలక పోవడంతో బాంబులేసి శబ్దాలు చేసి, ఏనుగును భయపెట్టి అడవిలోకి వెళ్లేలా చేశారు అధికారులు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు హర్షం వెలిబుచ్చారు.