modi: స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా మోదీ సత్యం పలకాలి: మంత్రి కాలవ శ్రీనివాసులు
- మోదీ నాయకత్వం దేశానికి శాపం
- అసమర్థ ప్రధాని మోదీ
- ప్రాంతీయ నాయకత్వాలపై దాడులు చేయిస్తున్నారు
ఉపన్యాసాలతో ఓ ఊపు ఊపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజునైనా సత్యం పలకాలని ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఏపీ సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాల కాలంలో దేశాన్ని ఎన్నో పార్టీలు, కూటములు పాలించాయని, అయితే, హామీలు అమలు చేయడంలో అత్యంత వైఫల్యం చెందడంలో మోదీ ఫస్ట్ అని విమర్శించారు.
2014 ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు విని మెరుగైన పాలన అందిస్తారన్న బలమైన విశ్వాసంతో ప్రజలు బీజేపీకి తిరుగులేని మెజార్టీ ఇచ్చారని, అయితే ఆయన దేశ ప్రజలను అడుగడుగునా వంచిస్తూ, వారిని కష్టాలు, కన్నీళ్లపాలు చేశారని మండిపడ్డారు. నాలుగేళ్ల తన పాలనలో దేశ ప్రజల ఆశలను మోదీ వమ్ము చేశారని, దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. మోదీ పాలనలో వేల కోట్లు సొమ్ము దోపిడీ చేసి, బ్యాంకులను లూటీ చేసిన వారు విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, ప్రతి పౌరుడిని దారుణంగా వెన్నుపోటు పొడిచి, నయవంచనకు గురి చేసి, నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు.
బీజేపీ ఇచ్చిన 246 ఎన్నికల హామీలలో 34 మాత్రమే అమలు చేశారని, ముందు చూపులేకుండా నిరంకుశమైన విధానాలు అనుసరించడం వల్ల దేశానికి నష్టం జరిగిందని కాల్వ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వం దేశానికి శాపమని, మీడియా హౌస్ పేరుతో జర్నలిస్టులు విడుదల చేసిన పుస్తకం ద్వారా మోదీ పాలనలోని ప్రగతి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టమైందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, జీడీపీ ఎక్కడ పెరిగిందని ప్రశ్నించారు.
2014 నుంచి గ్యాస్ రూ.500 నుంచి 850కి, డీజిల్ రూ.48 నుంచి రూ.74కు, పెట్రోల్ రూ.50 నుంచి 84కు పెరిగాయని, ప్రధాని దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగటమేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవంగా జీడీపీ తగ్గిందని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వృద్ధి రేటు రెండంకెలుగా కొనసాగుతోందని అన్నారు. మోదీ ఆర్థిక విధానాలు ప్రధానంగా నోట్ల రద్దు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఈ రద్దు వల్ల సామాన్యుడు వీధులపాలయ్యాడని, బ్యాంకింగ్ వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేసిన అసమర్థ ప్రధాని మోదీ అని విమర్శించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారు వేల కోట్లు దోపిడీ చేసి బ్యాంకులను ముంచేసి విదేశాల్లో విహరిస్తున్నారని విమర్శించారు. అనేక కుంభకోణాలు చేసిన వారికి బీజేపీ ప్రభుత్వం రక్షణగా ఉందని, ఆర్థిక నేరగాళ్లను రక్షిస్తుందని విమర్శించారు.
విజయసాయి రెడ్డి వంటి వారు ప్రధాన మంత్రి కార్యాలయంలో చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నారని, తప్పు చేసిన వారికి పీఎంఓ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతోందని కాలవ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నారని మోదీని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం దెబ్బతిన్నాయని, బ్లాక్ మనీని బయటకు తీసి ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పారని, ఆ డబ్బు ఎవరి ఖాతాలో వేశారు? అని ప్రశ్నించిన కాలవ, అమిత్ షా కొడుకు ఖాతాలో వేసి ఉంటారని ఎద్దేవా చేశారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పారని, కానీ ధరలు పెరిగిపోయాయని, రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడంలేదని అన్నారు.
2013-14లో దేశం అప్పులు రూ.56.69 లక్షల కోట్ల ఉండగా, రూ.79.62 లక్షల కోట్లకు పెరిగాయని, ప్రచార ఆర్భాటం తప్ప కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కాలవ విమర్శించారు. రాజకీయంగా ఆలోచిస్తే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ, మోదీ వ్యవహరిస్తున్నారని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కూడా కొంతమందికి పదవులు ఇచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారని, ప్రాంతీయ నాయకత్వాలపై దాడులు చేయిస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని, నిందలు మోపి అవమానాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని మంత్రి కాలవ డిమాండ్ చేశారు.