vh: కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన వీహెచ్
- తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లను కేసీఆర్ మొక్కారు
- సోనియాను 'బొమ్మ' అనేంత పెద్దోడివి అయ్యావా కేటీఆర్?
- కులాల పేరుతో ఓట్లు వేయించుకోవడానికి యత్నిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. తెలంగాణను సోనియాగాంధీ ఇవ్వగానే కుటుంబంతో సహా వెళ్లిన కేసీఆర్ ఆమె కాళ్లు మొక్కారని అన్నారు. తెలంగాణను తెచ్చింది నేనే అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని... తెలంగాణ కోసం పోరాటం చేసిన చెన్నారెడ్డి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం ప్రజలంతా పోరాడారని, ఆత్మబలిదానాలు చేశారని, పార్లమెంటులో పోరాడింది కాంగ్రెస్ నేతలేనని చెప్పారు. నీవొక్కడే పోరాడి తెలంగాణ తెచ్చినట్టు చెప్పుకుంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏయ్ కేటీఆర్... తెలంగాణను ఇచ్చింది అమ్మనా, బొమ్మనా అంటావా? అంత పెద్దోడివి అయిపోయావా?' అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు నిప్పులు చెరిగారు.
కులాల పేరుతో ఓట్లు వేయించుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ టూర్ ప్రాధాన్యతను తగ్గించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లేకుండా ప్రగతి భవన్ లో నాలుగు గంటలసేపు మీడియాతో మీటింగ్ పెట్టారని దుయ్యబట్టారు. హైకోర్టు ఇప్పటికే కేసీఆర్ కు చాలాసార్లు మొట్టికాయలు వేసిందని అన్నారు. తను ప్రసంగిస్తున్న సమయంలోనే రాహుల్ గాంధీ సభాప్రాంగణం వద్దకు చేరుకోవడంతో... తన ప్రసంగాన్ని వీహెచ్ అంతటితో ముగించారు.