Rahul Gandhi: 'రూపాయి పతనంపై నాడు మోదీ 'మాస్టర్ క్లాస్ వీడియో’ ఇది!' అంటూ వీడియో పోస్ట్ చేసి, సెటైర్లు వేసిన రాహుల్ గాంధీ!
- నాటి మోదీ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన రాహుల్
- సీఎం హోదాలో రూపాయి పతనంపై మోదీ వ్యాఖ్యలు
- ఈరోజు ఎంతో విషాదకరమన్న అహ్మద్ పటేల్
డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ.70.09 పైసలకు తాకిన విషయం తెలిసిందే. రూపాయి మారకం విలువ పడిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని ’సుప్రీం లీడర్’ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూపాయి పతనానికి గల కారణాలు చెప్పాలంటూ నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ కేంద్రాన్ని నిలదీసిన ఓ వీడియోను రాహుల్ జతపరిచారు. ‘ఇండియన్ రూపాయి తన అధినేత పట్ల అవిశ్వాసపు ఓటు ప్రకటిస్తూ రికార్డు స్థాయి పతనానికి జారిపోయింది. రూపాయి పతనం, ఆర్థిక విధానాలపై ‘సుప్రీం లీడర్’ గతంలో ఏం చెప్పారో ఈ వీడియోలో వినండి’ అని రాహుల్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
‘రూపాయి విలువ పతనం కావడం, డాలర్ విలువ పెరగడం ఇదే విధంగా కొనసాగితే ప్రపంచ పటం నుంచి భారత్ కనుమరుగు అవుతుంది... డాలర్ తో కేవలం రూపాయి మారకం విలువే ఎందుకు పతనమవుతోంది? దీనికి కేవలం ఆర్థిక విధానాలే కారకం కాదు .. ఢిల్లీ ప్రభుత్వ అవినీతి ఫలితమే కారణం’ అని నాటి ప్రధానిని మోదీ విమర్శించడం ఈ వీడియోలో కనపడుతుంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అహ్మద్ పటేల్ కూడా తన ట్వీట్ లో మోదీపై మండిపడ్డారు. చరిత్రలో తొలిసారిగా డాలర్ తో రూపాయి మారకం విలువ 70కు పడిపోయిందని, అది కూడా 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డెబ్బై సంవత్సరాలలో ఏ ప్రభుత్వం సాధించలేనిది బీజేపీ ప్రభుత్వం సాధించిందని, వారి అద్భుతమైన పాలనలో సాధించిన ఉన్నతి ఇదని.. నిజంగా ఎంత విషాదకరమైన రోజు ఇది! అంటూ సెటైర్లు విసిరారు.