Pawan Kalyan: భగత్ సింగ్ జీవితాన్ని యువత చదవాలి: పవన్ కల్యాణ్

  • పేదరికాన్ని పట్టించుకోనివాళ్ళు
  • అవినీతిపరులే..‘జనసేన‘ వర్గ శత్రువులు
  • కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలి

భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ప్రాణ త్యాగం చేశారని, ఇప్పుడు ఆ వయసులో ఉన్న యువత పబ్ లు, బైక్ రేసులకు వెళ్తోందని, ఈ యువత ఒకసారి భగత్ సింగ్ జీవితాన్ని చదవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందదర్భంగా పవన్ కల్యాణ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, విద్యార్థి  సంఘాలు, వీర మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, త్యాగధనుడు భగత్ సింగ్ స్వహస్తాలతో రాసిన మాటలు ఆకళింపు చేసుకోవాలని, వాటి నుంచి స్ఫూర్తి పొందాలని యువతకు సూచించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి వీరులు చేసిన త్యాగాల ఫలం మన స్వతంత్ర భారతం అని అన్నారు.

‘జనసేన’కి వర్గ శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరంటే.... సమాజంలో పేదరికాన్ని పెంచి పోషిస్తున్నవాళ్ళు, అవినీతిపరులు. పేదరికంలో ఉన్న వారిని పట్టించుకోకుండా అవినీతి చేసే వాళ్లను పార్టీ వర్గ శత్రువులుగా భావిస్తుంది. మహిళలకు రక్షణ ఇవ్వకుండా ఉన్న వాళ్ళని, చిన్నారులపై అకృత్యాలు చేసే వాళ్ళనీ వర్గ శత్రువులుగా చూస్తాం. వాళ్ళు పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. వేల కోట్లు సంపాదించాలనో, నా తరవాత మా అబ్బాయి, ఆ తరవాత మనవడు అధికారంలో ఉండాలనే ఆశలు నాకు లేవు. నా ఆశ ఒకటే - ప్రతి మనిషి కన్నీళ్లు తుడవడమే. అందుకే తపనపడుతుంటా. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. మీ పార్టీలో పెద్ద నాయకులు లేరు అంటారు. కొత్తవాళ్లను తీసుకొస్తాం. అణచివేతకు గురైనవాళ్లకే ఆగ్రహం ఉంటుంది. రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావాలి. కొత్త రక్తం రావాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలి. ప్రజల కష్టాలు తెలిసినవాళ్లు, ప్రజా క్షేత్రం నుంచి రావాలి’ అని పవన్ కోరారు.

‘లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే అనుభవం ఏది? వాళ్ళ తాతగారు అరవైయేళ్లు దాటాక వచ్చారు. ఇక కేటీఆర్ ప్రజల్లోంచి గెలిచి, పోరాటం చేసిన అనుభవం ఉంది. లోకేష్ కి అలాంటి అనుభవం ఎక్కడ ఉంది?  ఆదిలాబాద్ లో గిరిజన తాండాలకు వెళ్లినా, అరకు గిరిజన గ్రామాలకు వెళ్లినా అక్కడి వృద్ధులు, మహిళలు కోట్లు ఆస్తులు కావాలని అడగటం లేదు. తాగేందుకు మంచి నీళ్లు కావాలని అడుగుతున్నారు. అవి కూడా ఈ పాలకులు ఇవ్వడం లేదు. నేను మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విషయంలో తెలంగాణాకు సంబంధించి కూడా ప్రస్తావించి ఉంటే పూర్తి సంతృప్తితో ఉండేవాడిని. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ విషయాలు అందరికీ సంబంధించినవి. ఇవి జాతీయ స్థాయిలో వర్తించేవి. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగితే గానీ నిర్భయ చట్టం రాలేదు. మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలు రావాలన్నా, వారి సమస్యలపై చర్చించాలన్నా సభల్లో వారికి తగిన రిజర్వేషన్ ఇవ్వాలి. అవకాశం ఇస్తేనే ఆడపడుచులు తమ వాదన చెబుతారు’ అని పవన్ అన్నారు.

‘ఒక టీడీపీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై దాడి చేస్తారు! మంత్రి అచ్చెన్నాయుడు మహిళా ఉద్యోగిపై ఒత్తిడి తీసుకువస్తారు! మహిళలకు రాజకీయ స్థానం కల్పిస్తేనే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలం. నేనెప్పుడూ కులానికి వంత పాడను. మానవత్వమే ముఖ్యం. అన్ని కులాల మధ్య ఐక్యత తీసుకురావాలి. మనవి పరస్పర ఆధారిత కులాలు. ఐక్యతతోనే సాధించగలం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో వారికి సంబంధించిన నిధులు వారికే వెళ్లేలా చూడాలి. కులాల మధ్య వైరుధ్యాలను సయోధ్యతో సర్దుబాటు చేయాలి. సమాజంలోని ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్ల విషయంలో జోక్యం ఎందుకు? ప్రతీదీ రాజకీయం చేయడమేనా? గోవధ విషయంలో ఎందుకు రాజకీయం. బీఫ్ తినడం ఓ ఆహారపు అలవాటు. శాకాహారం తినే గుజరాత్ రాష్ట్రంలో గోద్రా ఘటన జరగడం ఏమిటి? ఆహారపుఅలవాటుకీ, హింసకీ సంబంధం ఉండదు. ముస్లింలను మైనారిటీలు అనడం కూడా నాకు నచ్చదు. వాళ్ళు భారతీయులు. అందరితో సమానమైన హక్కులే వాళ్ళకీ ఉన్నాయి. కొందరు ఫాసిస్టులు చేసే వ్యాఖ్యలకి, మాటలకీ భయపడాల్సిన అవసరం లేదు. నాకు అన్ని కులాలు, మతాలూ ఒకటే’ అని అన్నారు.

‘తెలంగాణలో పార్టీని దశల వారీగా ముందుకు తీసుకువెళదాం. తెలంగాణా ప్రాంతంపై నాకు పిచ్చి ప్రేమ. వీర తెలంగాణ పోరాటం గురించి చదివిన వాణ్ని. ఇక్కడి యువత, విద్యార్థులు, మహిళా లోకం చెప్పిన విధంగా పార్టీని నిర్మిద్దాం. వారు ఆశించిన బంగారు తెలంగాణాను సిద్ధింపచేద్దాం. బలం ఉన్న చోట పోటీ చేయడం మిగిలిన చోట్ల ప్రభావితం చేద్దాం. తెలంగాణ పోరాట సమయంలో కూడా గద్దర్ లాంటివారితో చెప్పాను... ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర పాలకుల్ని వేరు చేసి చూడమని. తెలంగాణాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు వెనుకబాటుతనం, దోపిడీకి కారణం ఒక ప్రాంతమో, కులమో కాదు.. పాలకులే. వారు, వారి కుటుంబాలే.

అందరూ తమ హక్కుల గురించి మాట్లాడతారు. అంతకంటే ముందు బాధ్యత తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకుంటాను మాటలుపడతాను. అయినా భయపడేది లేదు. బాధ్యత తీసుకుంటాను కాబట్టే ప్రశ్నించగలను. బాధ్యత తీసుకున్నవాడికే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఉన్న ఏ సమస్యనైనా సయోధ్య ద్వారా సర్దుబాటు చేయవచ్చు అని విశ్వసిస్తాను. ఈ దేశానికి సంబంధించిన సమగ్రత, సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యత. రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మనందరి ధర్మం’ అని పవన్ అన్నారు.  

  • Loading...

More Telugu News