Telangana: టికెట్.. టికెట్.. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం తహతహలాడుతున్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు!
- వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఉద్యోగులు
- అయితే టీఆర్ఎస్, లేదంటే కాంగ్రెస్ టికెట్‌పై
- ప్రయత్నాల్లో బిజీబిజీ
ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి గెలవాలని పలువురు నాయకులు పట్టుదలగా ఉన్నారు. టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం అవసరమైతే తమ సర్వీసును కూడా పణంగా పెట్టాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల నేతలుగా ఇప్పటికే విస్తృత సంబంధాలు ఏర్పరచుకున్న వారు వీలైతే శాసనసభ, లేదంటే లోక్‌సభకు పోటీ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగడం ద్వారా లబ్ధిపొందాలని వీరంతా యోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న వారంతా టీఆర్ఎస్, లేదంటే కాంగ్రెస్ టికెట్లను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 20 శాతం మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరికే అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ ప్రయత్నాలకు మరింత పదునుపెట్టారు. ఆయా స్థానాల్లో తాము దిగి సత్తా చాటుతామంటూ బాహాటంగానే చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమం తర్వాత చాలామంది ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాల్లో ప్రవేశించి విజయం సాధించారు. దీంతో తామెందుకు ఆ పని చేయకూడదని భావిస్తున్నవారు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఇలా ప్రయత్నిస్తున్న వారిలో దాదాపు అన్ని జిల్లాల వారు ఉన్నట్టు సమాచారం. ఉద్యోగుల నుంచి ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిపాదన తాకిడి ఎక్కువైనట్టు చెబుతున్నారు.