vajpayee: పదవులు ఆయనకు తృణ ప్రాయం.. విలువలు భూషణం.. వాజ్ పేయి జీవిత విశేషాలు!

  • విమర్శించేందుకు ప్రత్యర్థులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వని వాజ్ పేయి
  • వాజ్ పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో ఊహించారు
  • బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడు వాజ్ పేయే
  • ఇందిర ప్రభుత్వానికి బలమైన విమర్శకుడాయన
  • ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు
  • కార్గిల్ యుద్ధంలో పాక్ పీచమణిచిన నేత
  • పోఖ్రాన్ అణు పరీక్షలతో మన దేశ సత్తా చాటిన ధీశాలి

అది 1957..
ఒక విదేశీ నేతకు 33 ఏళ్ల పార్లమెంటు సభ్యుడిని అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ పరిచయం చేస్తూ.. 'ఈయన భావి భారత ప్రధాని' అంటూ చెప్పారు. నెహ్రూ సరదాగా అన్నారని అంతా అనుకున్నారు. కానీ, పండిట్ జీ మాటలు నాలుగు దశాబ్దాలకు నిజమయ్యాయి. 
అప్పటి ఆ యువకుడే అటల్ బిహారీ వాజ్ పేయి! 
     
ఓ అత్యున్నత విలువలతో కూడిన రాజకీయం, నిరాడంబర జీవితం కలబోస్తే.. అటల్ బిహారీ వాజ్ పేయి. తన జీవితంలో ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేనంతటి మహానేత ఆయన. తనను విమర్శించేందుకు రాజకీయ ప్రత్యర్థులకు సైతం ఒక్క అవకాశం ఇవ్వని మహోన్నత విలువలు కలిగిన రాజకీయవేత్త. తన యావత్ జీవితాన్ని భరతమాత సేవకే అర్పించిన గొప్ప వ్యక్తి. ఆయన సేవలకు గుర్తింపుగా భారత్ సర్కారు ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సమున్నత రీతిలో గౌరవించింది.  

1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో వాజ్ పేయి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్ పేయి. ఆయన తాత పండిట్ శ్యాంలాల్ ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ ప్రాంతం నుంచి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వచ్చారు. వాజ్ పేయి తండ్రి గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆయన మంచి కవి కూడా.

తండ్రి లక్షణాలనే పుణికిపుచ్చుకున్న వాజ్ పేయి... తాను కూడా సాహిత్యంలో మంచి పట్టు సాధించారు. గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిరంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన... ఆ తర్వాత గ్వాలియర్ లోని విక్టోరియా కళాశాలలో సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించి, పట్టభద్రుడయ్యారు. కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టాను సాధించారు.

ఆర్యసమాజంలో చేరిన యువ వాజ్ పేయి ఆర్యకుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించారు. 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆయనపై బాబా ఆమ్టే ప్రభావం అధికంగా ఉండేది. 1947లో పూర్థి స్థాయిలో ఆయన ఆరెస్సెస్ ప్రచారక్ అయ్యారు. దేశ విభజన అనంతరం దేశంలో చోటు చేసుకున్న అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశారు. ఇదే సమయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలు మరియు స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దినపత్రికలకు కూడా వాజ్ పేయి పని చేశారు. వాజ్ పేయి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తొలిసారి ఆయనకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అన్న ప్రేమ్ తో కలసి 23 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. అంటే... రాజకీయాల ప్రారంభంలోనే ఆయన జైలుకు వెళ్లారన్నమాట. అయితే, బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనబోనని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎలాంటి సంబంధాలను నెరపనని లిఖిత పూర్వక హామీ ఇచ్చిన తర్వాత ఆయనను జైలు నుంచి విడిచిపెట్టారు.

1951లో అప్పుడే కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో పని చేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్ పేయిని ఆరెస్సెస్ నియమించింది. ఈ పార్టీ ఆరెస్సెస్ కు అనుబంధంగా పని చేసేది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఈ పార్టీకి సంబంధించి ఉత్తరాది విభాగానికి వాజ్ పేయి కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. అతి తక్కువ కాలంలోనే జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీకి వాజ్ పేయి రైట్ హ్యాండ్ గా మారారు. 1954లో కశ్మీరులో కశ్మీరేతర భారతీయుల సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారనే విషయమై శ్యాంప్రసాద్ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు కూడా ఆయన పక్కనే వాజ్ పేయి ఉన్నారు. నిరాహారదీక్ష సమయంలోనే జైల్లో శ్యాంప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

1957లో బల్రామ్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్ సభలోకి అడుగుపెట్టారు వాజ్ పేయి. సభలో ఆయన చేసిన మెయిడెన్ స్పీచ్ (తొలి ప్రసంగం) అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. సభలో ఆయన వాగ్ధాటికి పార్లమెంటు సభ్యులంతా అచ్చెరువొందేవారు. తన ప్రసంగం మధ్యలో కవితలను వినిపించేవారు. సందర్భోచితంగా చెణుకులు విసిరేవారు. ఆయన ప్రసంగిస్తుంటే సభ మొత్తం చప్పట్లతో మారుమోగేది.

  తదనంతర కాలంలో తన వాగ్ధాటి, నాయకత్వ లక్షణాలతో జనసంఘ్ లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతం పార్టీ బాధ్యత మొత్తం ఆయనపై పడింది. 1968లో జనసంఘ్ అధినేతగా ఎదిగారు. అదే సమయంలో అద్వానీ, బల్ రాజ్ మధోక్, నానాజీ దేశ్ ముఖ్ లతో కలసి జనసంఘ్ ను జాతీయ స్థాయి ప్రాముఖ్యత గల పార్టీగా ముందుకు నడిపించారు.

1975 నుంచి 1977ల మధ్య కాలంలో దేశం రాజకీయపరంగా పలు పరిణామాలకు గురైంది. ఈ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. ఎంతో మంది నేతలు అరెస్ట్ అయ్యారు. 1977లో ఇందిరకు వ్యతిరేకంగా సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్ కాంగ్రెసేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పాడాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి జనతా పార్టీలో జనసంఘ్ ను విలీనం చేశారు వాజ్ పేయి.

1977లో భారత రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో వాజ్ పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడిగా వాజ్ పేయి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయానికే వాజ్ పేయి గౌరవప్రదమైన రాజకీయవేత్తగా, అనుభవం కలిగిన నాయకుడిగా అవతరించారు. 1979లో ప్రధానిగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత... కొన్ని రోజులకే జనతా పార్టీ ముక్కలైంది. జనసంఘ్ నేతలు జనతా పార్టీని సంఘటితంగా ఉంచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. అంతర్గత విభేదాలతో విసిగిపోయిన జనసంఘ్ చివరకు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది.

తదనంతర కాలంలో 1980లో జనసంఘ్, ఆరెస్సెస్ ల నుంచి వచ్చిన తన సహచరులు... ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితులైన అద్వానీ, బైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకుని భారతీయ జనతా పార్టీని వాజ్ పేయి ఏర్పాటు చేశారు. బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడు వాజ్ పేయే. ఆ తర్వాతి కాలంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకుడిగా ఆయన నిలిచారు. పంజాబ్ లో పెరిగిపోతున్న వేర్పాటువాదాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో దీనికంతా కారణం ఇందిర అవినీతి, విభజన రాజకీయాలే అంటూ ఆరోపించింది. ఖలిస్థాన్ కోసం పోరాడుతున్న సిక్కులపై ఇందిర చేపట్టిన 'ఆపరేషన్ బ్లూ స్టార్'ను కూడా బీజేపీ వ్యతిరేకించింది. 1984లో ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో ఇందిర హత్యకు గురైన తర్వాత ఢిల్లీలో సిక్కులపై జరిగిన దాడులను కూడా ఖండించింది.

1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ లోక్ సభలో రెండు సీట్లను గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా, లోక్ సభలో విపక్ష నేతగా వాజ్ పేయి కొనసాగారు. ఆ తర్వాత బీజేపీ రామ జన్మభూమి మందిర ఉద్యమాన్ని చేపట్టింది. 1995లో గుజరాత్, మహారాష్ట్రలకు జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని సాధించింది. అక్కడి నుంచి బీజేపీ వెనుదిరిగి చూసుకోలేదు. 1995లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్ పేయిని అద్వానీ ప్రకటించారు. 1996 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. వాజ్ పేయి తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతను స్వీకరించారు. తన జీవితకాలంలో మూడు సార్లు ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ఈ మూడు సార్లూ ఆయన పూర్తి కాలం ప్రధాని పదవిలో ఉండలేకపోవడం గమనార్హం.

ప్రధానిగా వాజపేయి తొలి పర్యాయం: 1996 మే నెల (13 రోజులు)
1996లో లోక్ సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించారు. ప్రధానిగా వాజ్ పేయి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైన బీజేపీ... సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. దీంతో, 13 రోజుల తర్వాత వాజ్ పేయి తన పదవికి రాజీనామా చేశారు.

ప్రధానిగా రెండో పర్యాయం: 1998-1999 (13 నెలలు)
1996 నుంచి 1998ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు (దేవేగౌడ, ఐకే గుజ్రాల్) వచ్చి, స్వల్ప కాలంలోనే కూలిపోయాయి. దీంతో లోక్ సభ రద్దై మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలిచి, భావసారూప్యం కలిగిన పార్టీలతో ఎన్డీయేను ఏర్పాటు చేసింది. దీంతో, వాజ్ పేయి రెండో సారి ప్రధాని అయ్యారు. పార్లమెంటులో ఎన్డీయే మెజార్టీని నిరూపించుకుంది. అయితే, ఈ సారి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రూపంలో వాజ్ పేయికి గండం వచ్చింది. ఎన్డీయేకు జయ మద్దతు ఉపసంహరించుకోవడంతో... 13 నెలల పాటు కొనసాగిన ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో వాజ్ పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. దీంతో, లోక్ సభ మళ్లీ రద్దయింది.

ప్రధానిగా మూడో పర్యాయం: 1999-2004
కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కూడిన ఎన్డీయే 303 స్థానాలు గెలిచి క్లియర్ మెజార్టీని సాధించింది. 1999 అక్టోబర్ 13న వాజ్ పేయి మూడోసారి ప్రధాని పదవిని అధిష్టించారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత 1998 మే నెలలో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ ప్రాంతంలో భారత్ ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. వాజ్ పేయి బాధ్యతలను తీసుకున్న నెల రోజుల లోపే ఈ పరీక్షలు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ పై అమెరికా, కెనడా, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలు ఆంక్షలను విధించాయి. 1999లో పాకిస్థాన్ తో శాంతి కోసం ఆయన ఢిల్లీ-లాహోర్ బస్సును ప్రారంభించారు. అయితే కుక్క తోక వంకర అన్నట్టు 1999 మే-జూన్ మధ్య కాలంలో కార్గిల్ యుద్ధానికి పాకిస్థాన్ తెరదీసింది. ఈ యుద్ధంలో పాక్ ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

మూడోసారి ప్రధాని అయిన తర్వాత వాజ్ పేయి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. దేశ వ్యాప్తంగా మౌలికవసతుల అభివృద్ధికి కృషి చేశారు. దేశ నలుమూలలనూ కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారులు... దేశ ప్రగతికి ఎంతో తోడ్పడ్డాయి. నేషనల్ హైవే డెవలప్ మెంట్ ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రాజెక్టులు వాజ్ పేయి మానస పుత్రికలు. తన పాలనలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. పరిశోధనలకు పెద్ద పీట వేశారు.

2004 సార్వత్రిక ఎన్నికల్లో వాజ్ పేయి చరిష్మాతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అందరూ భావించారు. అప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, బీజేపీ మంచి ఊపు మీద ఉంది. ఈ నేపథ్యంలో, ఐదేళ్ల కాలం పూర్తి కాకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లారు వాజ్ పేయి. 'ఇండియా షైనింగ్' నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, ఊహించని విధంగా ఎన్డీయే కూటమి ఓటమిపాలై, సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. తమ మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ యూపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడితో వాజ్ పేయి రాజకీయ జీవితం ముగిసింది.

2005 డిసెంబర్ లో ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన బీజేపీ సిల్వర్ జుబ్లీ ర్యాలీలో క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు వాజ్ పేయి ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన తెలిపారు. అద్వానీ, ప్రమోద్ మహాజన్ లు పార్టీకి రామలక్ష్మణుల్లాంటి వారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్ పేయిని రాజకీయ భీష్ముడిగా అభివర్ణించారు.

2009 ఫిబ్రవరి 6న ఛాతీలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను కొన్నాళ్లు వెంటిలేటర్ పై ఉంచారు. ఆ తర్వాత కోలుకున్నారు. 2001లో ఆయన మోకాలి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. 2009లో స్ట్రోక్ కారణంగా ఆయన పక్షవాతానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన మాట క్షీణించింది. తరచూ అనారోగ్యానికి గురవుతూ వీల్ చైర్ కు పరిమితమయ్యారు. మనుషులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నారు.

 గత కొన్ని రోజులుగా ఎయిమ్స్ లో మృత్యువుతో పోరాటం చేస్తూ, చివరకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భరతమాత కంటతడి పెట్టింది. యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. నీలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఇకపై మేము చూడగలమా అంటూ రోదిస్తోంది. వాజ్ పేయి లేని రాజకీయ వ్యవస్థను ఊహించుకోవడం సాధ్యంకానిది. ప్రస్తుత నేతల్లో ఆయనలాంటి ఆణిముత్యాన్ని చూడాలనుకోవడం దురాశే అవుతుంది. జోహార్ వాజపేయి.

  • Loading...

More Telugu News