vijay malya: లీగల్ ఫీజుల చెల్లింపు విషయంలో విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మరో ఆదేశం!
- భారత బ్యాంకుల కన్సార్టియంకు లీగల్ ఫీజుగా మరో రూ.1.5 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం
- ఇప్పటికే ఈ విషయంలో రూ.1.8 కోట్లు చెల్లించిన మాల్యా
- మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం
భారత్ లో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్ కు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాంకుల కన్సార్టియంకు లీగల్ ఫీజుగా మరో రూ.1.5 కోట్లు చెల్లించాలని అక్కడి కోర్టు ఆయనను ఆదేశించింది. ఇప్పటికే రూ.1.8 కోట్లు చెల్లించిన మాల్యా, మరో రూ.1.5 కోట్లు చెల్లించాలని కోర్టు తెలపటంతో మాల్యా లీగల్ ఫీజుల కింద భారత బ్యాంకులకు మొత్తం రూ.3.3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది .
భారత్ లోని వివిధ బ్యాంకులకు 10 వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై లండన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మాల్యాను భారత్ కు రప్పించటానికి అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పారిపోయిన ఆర్థిక నేరస్తుల జాబితాలో మాల్యాను చేర్చి ఆస్తులను జప్తుచేసి, వేలంవేసి బ్యాంకుల రుణాలు తీర్చాలని భారత్ భావిస్తోంది. అయితే మాల్యా మాత్రం భారత్ కు వచ్చేందుకు, బ్యాంకులతో రుణాల వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని తెలిపారు.
మాల్యాకు సంబంధించిన ఆస్తులు సీబీఐ, ఈడీ పరిధిలో వున్నాయని, తన ఆస్తులను, తన కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా కోర్టును కోరారు. తన రూ.13,900 కోట్ల విలువైన ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తానని తెలిపారు. భారత్ బ్యాంకులకు లీగల్ ఫీజులు చెల్లిస్తున్న మాల్యా అసలు రుణాలు ఎప్పుడు తీరుస్తాడో...భారత ప్రభుత్వం మాల్యా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, లండన్ కోర్టు మాల్యాను భారత్ కు అప్పగిస్తుందో లేదో వేచి చూడాలి.