Vajpayee: సరిహద్దులు దాటి, అణు దాడికి రెడీ... అమెరికా అధ్యక్షుడికి ఘాటైన లేఖ రాసిన వాజ్ పేయి!
- ఆగ్రహిస్తే దూకుడుగా వ్యవహరించే వాజ్ పేయి
- పాక్ కు బుద్ధి చెప్పే విషయంలో వెనక్కు తగ్గేది లేదు
- నాడు వాజ్ పేయి చూపిన రాజనీతిజ్ఞత
తాను ఎంత సౌమ్యునిగా కనిపిస్తారో, ఆగ్రహం వస్తే అంతే దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం వాజ్ పేయిది. కార్గిల్ లోకి పాకిస్థాన్ సైన్యం చొరబడిన వేళ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు పంపిన లేఖలో తనలోని దూకుడును ఆయన తెలియజెప్పారు. కార్గిల్ లో పోరాటం ద్వారా పాక్ దళాలను తరిమేయలేకుంటే మరో మార్గాన్ని ఎంచుకుంటామే తప్ప, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అవసరమైతే అణు దాడి చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేయడంతో, బిల్ క్లింటన్ తీవ్ర ఆందోళన చెంది, అప్పటికప్పుడు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆంథోనీ జిన్నీని అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ముషారఫ్ వద్దకు రాయబారిగా పంపారు. ఆ సమయంలో ముషారఫ్ కశ్మీర్ గురించి ప్రస్తావించబోగా, తాను కశ్మీర్ గురించి రాలేదని, కార్గిల్ కోసం వచ్చానని చెప్పిన జిన్నీ, కార్గిల్ నుంచి వెనక్కు రాకుంటే, అణు విధ్వంసాన్ని కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు. దీంతోనే ఆ ప్రాంతం నుంచి పాక్ సైనికులు వెనుదిరిగారు.
అయితే, కార్గిల్ యుద్ధం వేళ, వాజ్ పేయి కొంత మెతకగా వ్యవహరించారని, గీత దాటవద్దని తనకు నచ్చజెప్పారని నాటి ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ రెండేళ్ల కిందట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ లోతైన పరిశోధన చేసి, క్లింటన్ కు వాజ్ పేయి పంపిన లేఖను వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు ఆలోచిస్తే, వాజ్ పేయి రాజనీతిజ్ఞత ఎంత సరైనదో అనిపించక మానదు. ఆయన నాడు సరిహద్దులు దాటవద్దని సైన్యానికి సూచించడం సరైన నిర్ణయమేనని అంగీకరించక తప్పదు. అపార నష్టాన్ని నివారించేందుకు, నయాన భయాన పాక్ కు బుద్ధి చెప్పాలన్న ప్రయత్నంతోనే క్లింటన్ కు ఆయన లేఖ రాశారు.