Byculla zoo: మేకిన్ ఇండియా కాదు.. 'బోర్న్ ఇన్ ఇండియా' పెంగ్విన్ ఇది!
- ముంబైలోని బైకుల్లా జూలో జననం
- దేశంలో పుట్టిన తొలి పెంగ్విన్ గా రికార్డు
- దక్షిణ కొరియా నుంచి తెప్పించిన అధికారులు
పెంగ్విన్లు అనగానే మనకు ఠక్కున అంటార్కిటికా ఖండం గుర్తొచ్చేస్తుంది. అక్కడ పెద్దపెద్ద మంచు కొండలపై గుంపులు గుంపులుగా ఈ ఎగరలేని పక్షులు కనిపిస్తుంటాయి. దీంతో అక్కడి వాతావరణంలో తప్ప పెంగ్విన్లు ఇంకెక్కడా బతకలేవని అనుకుంటాం. కానీ అది తప్పని తేలింది. ముంబైలోని బైకుల్లా జూలో ఉంటున్న పెంగ్విన్ జంట ఓ బుజ్జి పెంగ్విన్ కు జన్మనిచ్చింది. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెంగ్విన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎన్ క్లోజర్ లో ఉంటున్న మోల్ట్ అనే మగ పెంగ్విన్, ప్లిప్పర్ అనే ఆడ పెంగ్విన్ లకు ఈ బుజ్జి పెంగ్విన్ పుట్టిందని జూ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కు మించకుండా ఉండేలా ప్రత్యేకమైన ఎన్ క్లోజర్ ను తయారుచేశామని వెల్లడించారు. ఈ రెండు పెంగ్విన్లను దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చామని అన్నారు. ఈ జంట కలవడంతో ప్లిప్పర్ జూలై నెలలో గుడ్డు పెట్టిందన్నారు. ప్రస్తుతం బుజ్జి పెంగ్విన్ ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. ఈ పెంగ్విన్ల జంటకు ఆహారంగా చేప పిల్లలను అందిస్తున్నామని చెప్పారు.