Sujana Chowdary: ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించడంలో వాజ్పేయి మార్గదర్శి!: సుజనాచౌదరి
- సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏకతాటి మీద నడిపిన ఘనుడు
- తెలుగు రాష్ట్రాలతో ఆయన బంధం విడదీయరానిది
- నేటి తరానికి ఆయన ఆదర్శం
భారత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఈ రోజు మన మధ్య లేకపోవడం దేశానికి తీరని లోటని టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆయన రాజకీయాల్లో గొప్పవ్యక్తి అని, నేటితరం నాయకులకు ఆదర్శమని చెప్పారు. భారతదేశ ప్రజలకు సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేని సుపరిపాలన అందించిన ఘనుడు అని పేర్కొన్నారు.
వాజ్పేయికి తెలుగు రాష్ట్రాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుజనా చౌదరి.. తాను రాజకీయాలలోకి రాకముందే వాజ్పేయి నిర్వహించిన రెండు, మూడు మీటింగ్లలో పాల్గొన్నానని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగించటంలో ఆయన అందరికీ మార్గదర్శి అని పేర్కొన్నారు. నిరాడంబరంగా జీవించిన , అహర్నిశలు కష్టపడిన గొప్ప పాలకుడు, నిస్వార్ధ నాయకుడని కొనియాడారు. ప్రధానిగా చక్కగా పాలించి భారత దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నానని సుజనా చౌదరి సంతాపాన్ని తెలియజేశారు.