Kaleswaram: వరద ఎఫెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేత!

  • వరదల వల్ల నిలిచిపోయిన కాళేశ్వరం పనులు 
  • మేడిగడ్డ వద్ద వరద ఉద్ధృతితో కాపర్ డ్యాంకు పొంచి ఉన్న ముప్పు 
  • వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వర్షాలు పడుతుండడంతో నిలిచిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చెయ్యాలని సంకల్పించిన ప్రభుత్వానికి ఎగువ నుండి వస్తున్న వరద నీరు ఆటంకంగా మారింది. దీంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలు, గ్రావెటీ కెనాల్‌ వద్ద పనులు నిలిచిపోయాయి.

 కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి, రెండో బ్యారేజి‌ అన్నారం, మేడిగడ్డ వద్ద ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా వున్న కారణంగా ఇంజినీరింగ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ వద్ద వరద ఉద్ధృతితో బ్యారేజి ప్రాంతంలో నిర్మించిన కాపర్‌ డ్యాంకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి వరద ఎక్కువ కావడంతో ఎల్లంపల్లి వద్ద గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. 
   
  ప్రస్తుతం కూలీలను , యంత్రాలను సురక్షిత ప్రాంతానికి తరలించి, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News