kerala: కేరళకు తక్షణ సాయంగా రూ.25 కోట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్
- కేరళకు ఆర్వో యంత్రాలనూ పంపాలి
- తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు
- సహాయనిధి అందించేందుకు సిద్ధమన్న కేసీఆర్
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అల్లకల్లోమైన విషయం తెలిసిందే. కేరళ పునర్నిర్మాణానికి విరాళాలు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేరళ బాధితుల కోసం రూ.25 కోట్ల తక్షణ సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ మొతాన్ని కేరళ ప్రభుత్వానికి అందించాలని తెలంగాణ సీఎస్ జోషిని ఆదేశించారు. వరదల వల్ల జలకాలుష్యం అయిన ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఆర్వో యంత్రాలను కేరళకు పంపాలని అధికారులకు స్పష్టం చేశారు.
కేరళను ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకు ఉంది
తెలంగాణ రాష్ట్రం తరపున కేరళకు సహాయనిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా తమకు ఉందని అన్నారు. ఈ విపత్తు కారణంగా కేరళలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి కేరళ రాష్ట్రం తొందరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, ఇతర రంగాలకు చెందిన వారు సాయం అందించేందుకు ముందుకురావాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. సీఎం సహాయనిధికి విరాళాలిస్తే వాటిని తక్షనం కేరళకు పంపే ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ చెప్పారు.