amit agarwal: ఉద్యోగులకు అమెజాన్ ఇండియా చీఫ్ విలువైన సూచన!
- సాయంత్రం ఆరు గంటలకు సిస్టంను లాగాఫ్ చేయండి
- వ్యక్తిగత జీవితానికి ప్రశాంతత అవసరం
- ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో అమిత్
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్ విలువైన సూచన చేశారు. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఏం చేయాలో వివరించారు. ఉద్యోగానికి-వ్యక్తిగత జీవితానికి మధ్య సమతూకం పాటించేందుకు చిట్కా చెప్పారు. సిస్టంను లాగౌట్ చేయడమే ఆ చిట్కా. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ-మెయిల్స్, వర్క్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.
ఆఫీసు పని మెరుగుపడాలంటే వ్యక్తిగత ప్రశాంతత ఎంతో అవసరమని పేర్కొన్న అమిత్.. అది దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అమెజాన్‌లో పనిచేయడమంటే కత్తిమీద సామేనని చాలామంది ఉద్యోగుల ఆరోపణ. ఆఫీసు నుంచి ఎప్పుడేం కబురు వస్తుందో, ఎప్పుడే ఈ-మెయిల్ వస్తుందో తెలియక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వచ్చిన మెయిల్స్‌కు స్పందించడంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ ఈ-మెయిల్‌తో ఉద్యోగులు ఊపరి పీల్చుకుంటున్నారు. అమెజాన్‌లో మారుతున్న వర్క్ కల్చర్‌కు దీనిని తొలి మెట్టుగా భావిస్తున్నారు.