YSRCP: వైకాపా నేతల గొడవను చిత్రీకరించిన మీడియా... కెమెరాలు లాక్కొని డిలీట్ చేసిన విజయసాయిరెడ్డి అనుచరులు!
- తంగేడులో సమావేశమైన వైకాపా నేతలు
- తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని గొడవకు దిగిన పైల రమేష్
- వాగ్వాదం, వైకాపా నేతల మధ్య గొడవ
ప్రస్తుతం విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, త్వరలో పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించనుండగా, ఏర్పాట్లను గురించి చర్చించేందుకు వైకాపా నేతలు సమావేశమైన వేళ, వాగ్వాదం, గొడవ జరుగగా, దాన్ని చిత్రీకరించిన మీడియా కెమెరాలను విజయసాయిరెడ్డి అనుచరులు లాక్కొని డిలీట్ చేశారు. ఈనెల 20న కోటవరట్ల జంక్షన్ లో జగన్ బహిరంగ సభ జరగనుండగా, సభను విజయవంతం చేసే అంశంపై తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు ఇంట్లో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగిన సమయంలో ఈ ఘటన జరిగింది.
అందరూ మాట్లాడిన తరువాత విజయసాయి మాట్లాడేందుకు వచ్చి, ఇంకెవరైనా మాట్లాడతారా? అన్నప్పుడు, పైల రమేష్ ముందుకు వచ్చి, మండల పార్టీ అధ్యక్షుడినైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సమావేశాన్ని ముగించాలని చూశారంటూ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం జరిగింది. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయగా, విజయసాయిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఆపై మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ, రమేష్ కు ముందుగానే మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వుందని, తనను క్షమించాలని కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది.