punjab: ప్రయాణికురాలి టికెట్ ను తానే చెల్లించిన టీటీఈ.. సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ
- పంజాబ్ లోని జలంధర్ లో ఘటన
- ఉదారంగా ప్రవర్తించిన దర్శన్ సింగ్
- పెద్దావిడకు అండగా నిలిచిన తోటి ప్రయాణికులు
చదువు రాకపోవడంతో బస్సులు, రైళ్లలో ప్రయాణించే పెద్దవాళ్లతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్లు, టికెట్ కలెక్టర్లను మనం చూసుంటాం. కానీ ఓ పెద్దావిడ పొరపాటున సాయంత్రం రైలుకు బదులుగా ఉదయాన్నే రైలు ఎక్కడాన్ని గుర్తించిన ఓ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆమెకు జరిమానాతో పాటు కొత్త టికెట్ ఇచ్చాడు. తన వద్ద టికెట్ కు డబ్బు లేదని ఆమె వాపోవడంతో.. ఆ డబ్బులు తానే చెల్లిస్తాననీ, భయపడవద్దని ఆమెకు ధైర్యం చెప్పాడు.
పంజాబ్ లోని జలంధర్ లో ఉంటున్న ఓ పెద్దావిడ(75) ఢిల్లీకి వెళ్లేందుకు శనివారం జలంధర్-ఢిల్లీ శతాబ్ది ట్రైన్ లో టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. టికెట్ సాయంత్రం రైలుకు రిజర్వ్ అయితే పెద్దావిడ మాత్రం అది ఉదయం ఢిల్లీకి వెళ్లే ట్రైన్ అని అనుకున్నారు. తల్లి మాటలు నమ్మిన కొడుకు టికెట్ సరిచూడకుండా ఆమెను చక్కగా శతాబ్ది రైలులో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. మరికొద్ది సేపట్లో జలంధర్ చేరుకుంటామనగా.. టీటీఈ దర్శన్ సింగ్ చెకింగ్ కోసం వచ్చాడు.
ఆమె పొరపాటున రైలు ఎక్కిందని గుర్తించి పాత టికెట్ ను రద్దుచేశాడు. అనంతరం కొత్త టికెట్ తో పాటు జరిమానా కూడా విధించాడు. ఈ మొత్తం రూ.2,200కు చేరుకుంది. దీంతో తన వద్ద అంత నగదు లేదని సదరు వృద్ధురాలు వాపోయింది. ఇలాంటి సందర్భంలో మరొకరు అయితే దురుసుగా ప్రవర్తించేవారే. కానీ సింగ్ మాత్రం హుందాగా ప్రవర్తించాడు. ‘భయపడకండి.. మీరు నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు నేనే చెల్లిస్తాను. మీరు ఇదే ట్రైన్ లో ఢిల్లీకి వెళ్లొచ్చు’ అని ధైర్యం చెప్పాడు.
దర్శన్ సింగ్ మాటలతో కదిలిపోయిన బోగీలోని ప్రయాణికులు తలా కొంత డబ్బులు వేసుకుని టికెట్ ధర మొత్తాన్ని పెద్దావిడ చేత ఆయనకు ఇప్పించారు. చివరికి ఈ విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు.. దర్శన్ సింగ్ ను అభినందించారు. త్వరలోనే దర్శన్ ను సన్మానించనున్నట్లు మీడియాకు వెల్లడించారు.