Tirupati: మరోసారి ఏపీకి గౌరవం.. భద్రతలో తిరుపతికి దేశంలోనే రెండో స్థానం!
- రక్షణ, భద్రతలలో తిరుపతి దేశంలోనే రెండో స్థానం
- ఏపీ పోలీసులు అమలు చేస్తున్న విధానాలే కారణం
- సుఖమయ జీవనానికి కూడా తిరుపతి ది బెస్ట్ అన్న కేంద్రం
జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి తన సత్తా చాటుకుంది. దేశంలో రక్షణ, భద్రత వున్న నగరాల్లో తిరుపతి రెండో స్థానం దక్కించుకుని తన ఖ్యాతిని చాటుకుంది. . ఏపి పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో తిరుపతికి అరుదైన ఈ గౌరవం దక్కింది. భద్రత, రక్షణ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ దేశంలోని 111 నగరాలను పరిశీలించి తిరుపతికి రెండో స్థానాన్ని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇప్పటికే దేశంలోనే నంబర్ 1గా నిలవగా, అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోనూ దూసుకెళ్లింది. సుఖమయ జీవనానికి వీలు కల్పిస్తున్న నగరాల్లో ఎంపికైన నాలుగు సిటీలు ఏపీలోనివే. అందులోనూ తొలి పది నగరాల్లో రెండు ఏపీవే కావడం విశేషం!
ఈ నగరాల ఎంపికకు ప్రాతిపదికగా తీసుకొన్న నాలుగు సూచీల్లో తిరుపతి, విజయవాడ స్థానం పొందాయి. ఒక సూచీలో అయితే, తిరుపతి దేశంలోనే అత్యున్నత నగరంగా ఎంపిక అయింది. నివాసయోగ్యమైన నగరాలలో నాలుగో స్థానం, భౌగోళికంగా ఆరో స్థానం, ఆర్ధికం గా 38వ స్థానంలో వుంది. పదిహేను కేటగిరీల్లో.. ఘన వ్యర్థాల నిర్వహణలో ఒకటి, పరిపాలన, భద్రతలో రెండు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో మూడో స్థానం, విద్యలో, సంస్కృతిలో నాలుగు, సురక్షిత మంచినీటి సరఫరాలో తొమ్మిది, వైద్యంలో 11, రవాణాలో 13, బహిరంగ స్థలాలలో 14, ఉపాధిలో 38, కాలుష్య నియంత్రణలో 51, విద్యుత్తు సరఫరాలో 64, హౌజింగ్‌లో 83, మిశ్రమ భూమి వినియోగంలో 87వ స్థానాన్ని దక్కించుకుంది తిరుపతి. భద్రత, రక్షణలో తిరుపతికి రెండోస్థానం రావడంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.