david headley: వాజ్ పేయి అంత్యక్రియల్లో పాల్గొన్న టెర్రరిస్టు సోదరుడు.. సర్వత్ర విమర్శలు
- అంత్యక్రియలకు హాజరైన దన్యాల్ గిలానీ
- డేవిడ్ హెడ్లీకి సవతి సోదరుడు గిలానీ
- హెడ్లీ కుటుంబంతో తనకు సంబంధాలు లేవన్న గిలానీ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరైన పాక్ ప్రముఖుల్లో ఓ ఉగ్రవాది సోదరుడు కూడా ఉండటం ఇప్పుడు వివాదాస్పదమైంది. శుక్రవారం నాడు జరిగిన అంత్యక్రియలకు పాకిస్థాన్ నుంచి ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఓ బృందం హాజరైంది. వీరిలో పాక్ న్యాయ సమాచార శాఖ మంత్రి సయ్యద్ అలీ జాఫర్ తో పాటు ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దన్యాల్ గిలాని కూడా ఉన్నారు. ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీకి గిలాని సవతి సోదరుడు అవుతారు. దీంతో, ఆయన రాకపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని వాజ్ పేయి అంత్యక్రియలకు ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ స్పదించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు గిలానీ భారత్ కు వచ్చారని... అదే సమయంలో ఆయన వాజ్ పేయి అంత్యక్రియల్లో పాల్గొన్నారని తెలిపింది. పాక్ ప్రభుత్వ అధికారిగా ఉన్న ఆయనను అనుమతించకుండా ఉండేందుకు ఎలాంటి కారణాలు కనిపించలేదని పేర్కొంది. ఆయన పేరు బ్లాక్ లిస్టులో కూడా లేదని తెలిపింది.
దీనిపై గిలానీ కూడా స్పందించారు. ఓ ప్రభుత్వ అధికారిగా పాకిస్థాన్ కు సేవ చేయడం తన కర్తవ్యమని ఆయన చెప్పారు. డేవిడ్ హెడ్లీ కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని... అయినా ఒక వ్యక్తితో బంధుత్వం ఉండటం పాపం కాదు కదా? అని ఆయన అన్నారు.