Kerala: సైనిక దుస్తుల్లో కేరళపై విషం చిమ్మిన జవాను.. నకిలీదిగా తేల్చిన ఆర్మీ!
- ఆర్మీ జవాన్ దుస్తుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- నకిలీ వీడియోగా తేల్చిన భారత సైన్యం
- కేరళలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటన
ఓ వైపు భారీ వర్షాలతో కేరళ అల్లాడుతుంటే.. మరోవైపేమో కొందరు దుండగులు విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్లు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా భారత ఆర్మీ యూనిఫాం ధరించిన ఓ యువకుడు కేరళ ప్రజలను తూలనాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘భారతీయ మహిళా మోర్చా తలస్సేరి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి సైనిక దుస్తులు ధరించి మాట్లాడుతూ.. ‘భారత సైన్యంపై మీకు (కేరళ ప్రజలకు) ఎందుకంత ద్వేషం? మేం కేరళకు రావడం మీ మంత్రి కొడియారి బాలకృష్ణన్ కు ఇష్టం లేదా? చెంగన్నూర్ లో వేలాది మంది చిక్కుకుపోయారు. మమ్మల్ని మా పని చేయనివ్వండి. మేము మీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోము. భయపడకండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియో వైరల్ గా మారడంతో భారత ఆర్మీ వెంటనే స్పందించింది. కేరళలో ఆర్మీ చేపడుతున్న సహాయ కార్యకలాపాలపై ఓ మోసగాడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ట్వీట్ చేసింది. ఈ ఘటన వెనుక ఉన్నవారు ఎవరో తెలిస్తే వెంటనే తమ నంబర్ +917290028579 కి వారి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించింది. ప్రస్తుతం జవాన్లు కేరళలో సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించింది.