Imran Khan: 'ఇంటి' నుంచే పాక్ ప్రధాని పొదుపు చర్యలు.. హంగూ ఆర్భాటాలు వద్దన్న ఇమ్రాన్!

  • అధికారిక నివాసంలో ఉండనని చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ 
  • పొదుపు కోసం పనివాళ్లనూ వద్దన్న పాక్‌ ప్రధాని 
  • ప్రజల కష్టాలను తీర్చటం కోసం కఠిన నిర్ణయాలు

ఒక దేశ ప్రధాని అధికారిక నివాసం ఎలా వుంటుంది? ఇంటినిండా నౌకర్లు, ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు, సెక్యూరిటీ, వందల సంఖ్యలో కార్లు.. ఇలా హోదాకు తగ్గట్టు వుంటుంది. కానీ అలాంటి హడావిడి, హంగామా తనకు అవసరం లేదని అంటున్నారు పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అందుకే, తన అధికారిక నివాస భవనంలో ఉండబోనని ఆయన స్పష్టం చేశారు. అందుకు బదులుగా తాను మిలిటరీ సెక్రటరీకి కేటాయించిన ఓ మూడు పడక గదుల ఇంట్లో ఉంటానని తెలిపారు. అసలు తాను తన సొంత నివాసం బెనిగలాలోనే ఉంటానని అన్నానని, అయితే భద్రత కారణాల వల్ల సెక్యురిటీ ఏజెన్సీలు అందుకు అంగీకరించడం లేదని ఇమ్రాన్‌ తెలిపారు.

 ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ప్రసంగంలో పొదుపు చర్యల్లో భాగంగా ఖర్చులు తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను సైన్యానికి చెందిన సెక్రటరీకి కేటాయించే భవనంలో ఉండబోతున్నట్లు చెప్పిన ఆయన, కేవలం ఇద్దరు పనివాళ్లను మాత్రమే తనతో ఉంచుకుంటానన్నారు. ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కోసం రెండు కార్లను మాత్రమే ఉంచానన్నారు.

మామూలుగా ప్రధాని అధికారిక నివాసంలో 524 మంది పనివాళ్లు, 80 కార్లు ఉంటాయని, ప్రధాని అయిన తనకు 33 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు, ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలు కూడా ఉంటాయని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పెద్ద బంగ్లాలు, విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు.

 "ప్రధాన మంత్రులు విదేశీ పర్యటనలకు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో చూడండి. వీళ్లు 650 మిలియన్‌ డాలర్లు ఏం చేశారు? స్పీకర్‌ 160 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ తనకోసం కేటాయించుకుని ఏం చేశారు? విదేశాలకు వెళ్లి భూములు కొనుక్కుంటున్నారా?" అని ఖాన్‌ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా అనవసర వ్యయాలు తగ్గించేందుకు డా.ఇష్రత్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 పాక్‌ అప్పుల్లో కూరుకుపోయిందని, బయటపడేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. పాక్‌ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించేందుకు నిధులు లేవని, ప్రజలు దారుణమైన పరిస్థితులు గడుపుతున్నారని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక బంగ్లాను రీసెర్చి యూనివర్సిటీగా మార్చాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News