ds: డీఎస్ కుమారుడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
- లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న సంజయ్
- బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు
- విచారణ ఇంకా పూర్తి కాలేదన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
తెలంగాణలో సీనియర్ రాజకీయవేత్త అయిన డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.
తన నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఆయనను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. దీంతో, ఆయన తరపు న్యాయవాదులు ఈ నెల 14న బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
సంజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని... విచారణకు మరింత సమయం పడుతుందని కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు చివరకు సంజయ్ కు 13 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది.