jagan: ఆ ఐదు పార్టీలతో ఐదు పెళ్లిళ్లు చేసుకుని వదిలేసిన చంద్రబాబు.. ఆరో పెళ్లికి సిద్ధమయ్యారు!: జగన్ ఎద్దేవా
- చంద్రబాబు పాలన అవినీతి, మోసం, అబద్ధాలతో సాగుతోంది
- ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు
- బయట 3 సెం.మీ. వర్షం పడితే.. సెక్రటేరియట్ లో 6 సెం.మీ లీక్ అవుతోంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు పెళ్లిళ్లు చేసుకుని వదిలేశారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, జనసేన, బీజేపీలను పెళ్లి చేసుకుని, వదిలేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని విమర్శించారు. విశాఖ జిల్లా కోటవురట్ల బహిరంగ సభలో ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం మన ఖర్మ అని అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు.
బాబు పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జగన్ అన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని... తీరా చూస్తే ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. అవినీతి సొమ్ముతో సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని... వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని మండిపడ్డారు.
రాజధానిలో ఇప్పటి వరకు పర్మినెంట్ గా ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ కు అడుగుకు రూ. 10 వేలు ఇచ్చారని... అయినా, బయట 3 సెంటీమీటర్ల వర్షం పడితే, సెక్రటేరియట్ లో 6 సెంటీమీటర్ల వర్షం లీక్ అవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన అవినీతి, అబద్ధాలు, మోసాలతో సాగుతోందని విమర్శించారు.