sivasena: ఆ ఆలింగనం హేయమైన, సిగ్గుమాలిన చర్య!: 'సిద్ధూ'పై శివసేన ధ్వజం
- పంజాబ్ ఉపముఖ్యమంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ సిద్ధూపై మండిపడిన శివసేన
- దేశ ద్రోహిగా సిద్ధూపై నిషేధం విధించాలి
- సొంత పత్రిక సామ్నాలో ఎడిటోరియల్
పంజాబ్ ఉపముఖ్యమంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సిద్ధూ పాకిస్తాన్లో పర్యటించడమే తప్పైతే, ఆ దేశ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం అత్యంత హేయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. శత్రు దేశంలో పర్యటించిన సిద్ధూను దేశద్రోహిగా ప్రకటించాలని, ఆయనపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇదే అంశంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ ను ప్రచురించింది. ''ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. దేశ సైనికుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దీనిపై ప్రధాని మోదీ కఠిన నిర్ణయం తీసుకోవాలి. సిద్ధూపై నిషేధం విధించాలి’’ అని శివసేన డిమాండ్ చేసింది.
మరోపక్క, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపైనా శివసేన మండిపడింది. నోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని దేశ ద్రోహులని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ, శత్రు దేశమైన పాకిస్తాన్లో పర్యటించిన సిద్ధూను ఎందుకు దేశ ద్రోహిగా ప్రకటించలేదని ప్రశ్నించింది. సిద్ధూ విషయంలో బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు చెప్పింది.
‘‘పాకిస్తాన్ను సందర్శించి సిద్ధూ చేసిన సిగ్గుమాలిన పని.. కాంగ్రెస్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు.. సిద్ధూపై చర్యలకు ఉపక్రమించాలి" అంటూ కేంద్రంపైన, పాకిస్తాన్ వెళ్లి వచ్చిన సిద్ధూపైన శివసేన ఫైర్ అయ్యింది.