Kerala floods: కేరళ విలయంపై తాజా గణాంకాలు ఇవీ.. వెల్లడించిన ముఖ్యమంత్రి
- 370 మంది ప్రాణాలు తీసిన వరదలు
- నిరాశ్రయులుగా మారిన పది లక్షల మంది
- రూ.20 వేల కోట్ల నష్టం
గతంలో ఎన్నడూ లేనంతగా జల విలయంలో చిక్కుకున్న కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేరళ వరదలను కేంద్రం ‘తీవ్ర విప్తతు’గా ప్రకటించింది. సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ వరదల నష్టంపై తాజా గణంకాలను వెల్లడించారు. వరదల కారణంగా 370 మంది ప్రాణాలు కోల్పోయారని, పది లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. నిరాశ్రయులందరూ 3,274 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్టు వివరించారు.
సోమవారం 602 మందిని రక్షించినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కేరళ వార్షిక వ్యయం రూ.37,248 కోట్లని, ఇప్పుడు వరదల కారణంగా సంభవించిన నష్టం ఐదేళ్ల ప్రణాళిక వ్యయం కంటే ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు రూ.210 కోట్లు వచ్చాయని, మరో 160 కోట్లు రానున్నాయని తెలిపారు. కాగా, వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిలినట్టు అంచనా వేస్తున్నారు.