Hyderabad: బ్రేకింగ్ న్యూస్... హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురుదెబ్బ!
- సింగిల్ బెంచ్ తీర్పు సస్పెన్షన్
- రెండు నెలల పాటు అమలవుతుందన్న డివిజన్ బెంచ్
- అనర్హత వేటుపై ప్రభుత్వానికి ఊరట
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ పై మైకులు విసిరి, ఆయన కంటికి గాయం కావడానికి కారణమయ్యారంటూ, కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జ్, వారిపై అనర్హత వేటు కుదరదని తీర్పిచ్చారు. ఘటనకు సంబంధించి వీడియో సాక్ష్యాలను కోర్టుకు అందించడంలో అసెంబ్లీ అధికారులు విఫలం కావడంతో, వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించగా, విచారించిన ధర్మాసనం, సింగిల్ బెంచ్ తీర్పును రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.