TTD: పూరి దేవాలయ అభివృద్ధికి సంకల్పం.. తిరుమలలో ఒడిశా అధికారుల అధ్యయనం!
- టీటీడీ పాలనా వ్యవస్థపై అధ్యయనం
- తిరుమల తరహాలో పూరీ జగన్నాధ ఆలయ అభివృద్ధి
- టీటీడీ అధికారులతో సమావేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పూరిలోని శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీటీడీ పాలనా వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఈ కమిటీ తిరుమల చేరుకుంది. తెలుగురాష్ట్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పాలనాపరంగా దేశంలోనే ఖ్యాతి గడించిన టీటీడీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను అడిగి కమిటీ సభ్యులు తెలుసుకున్నారు.
తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవోతో సమావేశమైన కమిటీ శ్రీవారి ఆలయ, అనుబంధ ఆలయాల నిర్వహణ, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, పథకాలు, ధర్మ ప్రచార కార్యక్రమాలు, ఎస్వీబీసీ, ట్రస్టులు, పారిశుద్ధ్యం, పరకామణి, గోశాల, భద్రత, నిఘా వ్యవస్థ, వసతి కల్పన తదితర అంశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నారు.
ఉదయం ఒడిశా కమిటీ సభ్యులు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి సేవా విధానం, శ్రీవారి ఆలయం , పరకామణి, లడ్డూల తయారీ, కౌంటర్లలో విక్రయం, నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం, శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. అనంతరం పరిపాలనా భవనంలోని నాణేల పరకామణిని, ఖజానా విభాగాలను గురించి తెలుసుకున్నారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారి సందేహాలను నివృత్తి చేసి, అవసరమైన సమాచారాన్ని అందించారు. టీటీడీపై అధ్యయనం చేయడానికి వచ్చిన ఉన్నతస్థాయి కమిటీలో ఒడిశా అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్.సి మహాపాత్ర, ఐజీ ఎస్.కె ప్రియదర్శి, జగన్నాథ ఆలయకమిటీ సభ్యుడు ఎం.త్రిపాఠి ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూరీ జగన్నాధ దేవాలయ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఈ ఉన్నతస్థాయి కమిటీ టీటీడీ పాలనా పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది.