Jammu And Kashmir: కశ్మీర్లో బీజేపీ కార్యకర్తను కాల్చిచంపిన టెర్రరిస్టులు
- జమ్ముకశ్మీర్‌లో టెర్రిస్టుల ఘాతుకం
- పుల్వామా జిల్లాలో ఘటన
- కశ్మీర్ యువత ఆలోచనను ఇవి ఆపలేవు: అమిత్ షా
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్త షబ్బీర్ అహ్మద్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రక్ ఈ లిట్టర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
భట్‌ను మంగళవారం మధ్యాహ్నమే టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారని, అతనికోసం గాలింపు చర్యలు చేపడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు చెబుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి వారం తిరగకుండానే టెర్రరిస్టులు తొలి హత్యకు పాల్పడడం గమనార్హం.
బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మంచి భవిష్యత్తును కోరుకుంటున్న కశ్మీర్ యువతను ఇటువంటి ఘటనలు నిలువరించలేవని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘టెర్రరిస్టుల హత్యాకాండ గర్హనీయం. ఇటువంటి పిరికిపంద చర్యల ద్వారా మంచి భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్న కశ్మీర్ యువత ఆలోచనలను మార్చలేరు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
‘మా కార్యకర్త షబ్మీర్ అహ్మద్ భట్ త్యాగం వృథాగా పోదు. మొత్తం బీజేపీ కుటుంబం భట్ కుటుంబానికి అండగా ఉంటుంది. భట్ కుటుంబానికి నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. ఇటువంటి విషాదకర పరిస్థితుల్లో ఆ భగవంతుడు భట్ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని షా ట్వీట్ చేశారు.