Kerala: కేరళకు అండగా నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్.. రూ.21 కోట్ల విరాళం ప్రకటన!
- మరో రూ.50 కోట్ల చేయూత
- గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ పంపిణీ
- వారం పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందిస్తోన్న జియో
వరదలతో సర్వం కోల్పోయి కన్నీళ్లు పెడుతున్న కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.21 కోట్ల విరాళం అందజేసింది. దాంతో పాటు రూ.50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తూ, సహకార చర్యల్లో తమ వంతు సహకారం చేస్తోంది.
వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ సహాయక చర్యల్లో పాల్గొంది. వారం క్రితం నుండే వయనాడ్, త్రిస్సుర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో రిలయన్స్ సంస్థ వలంటీర్లు పని చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ తరుపున 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ ని పంపిణీ చేస్తోంది. అలాగే, కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు జియో ప్రకటించింది.