shatrughan sinha: పాక్ ప్రధానులను మోదీ ఆలింగనం చేసుకోలేదా?: సిద్ధూకు మద్దతుగా నిలిచిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా
- బీజేపీని నేను ఎప్పుడూ విమర్శించలేదు
- పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యంకాదనే విషయాన్ని నేను వాజపేయి, అద్వానీ నుంచి నేర్చుకున్నా
- సిద్ధూ అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ను హత్తుకున్న మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్ధూపై విమర్శలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూకు బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా మద్దతుగా నిలిచారు. దివంగత వాజపేయి, ప్రధాని మోదీలు పాక్ ప్రధానులను గతంలో ఆలింగనం చేసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. పాక్ పర్యటన సందర్భంగా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను మోదీ కౌగిలించుకోలేదా? అని అడిగారు. ఈ అంశానికి సంబంధించి సిద్ధూ ఇప్పటికే వివరణ ఇచ్చారని... ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు.
కోల్ కతాలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ కామెంట్ చేయలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీని విమర్శించినట్టు కాదని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీనే గొప్పదని తాను వాజపేయి, అద్వానీ, నానాజీ దేశ్ ముఖ్ ల నుంచి నేర్చుకున్నానని చెప్పారు. జీఎస్టీ మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.